టీటీడీ దర్శన టికెట్ల రద్దు ఎఫెక్ట్.. తగ్గిన టూరిజం శాఖ ఆదాయం.. టూరిజం బస్సులకు బ్రేక్ !

టీటీడీ దర్శన టికెట్ల రద్దు ఎఫెక్ట్.. తగ్గిన టూరిజం శాఖ ఆదాయం.. టూరిజం బస్సులకు బ్రేక్ !
  • 30 బస్సుల్లో 10 బస్సులు మాత్రమే రన్నింగ్..
  • తగ్గిన టూరిజం శాఖ ఆదాయం 
  • టీటీడీ దర్శన టికెట్ల రద్దు ఎఫెక్ట్ 
  • ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారించని అధికారులు

హైదరాబాద్​, వెలుగు: పర్యాటక శాఖ అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ కొరవడటంతో టూరిజం బస్సులకు బ్రేక్​ పడింది. దీంతో  పర్యాటక అభివృద్ధి సంస్థ నెలనెలా రావాల్సిన ఆదాయానికి గండిపడింది. అంతేకాదు, సుమారు నెలకు రూ.కోటిపైగా ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం 2015లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)తో ఒప్పందాన్ని చేసుకున్నది.

ఏపీ ప్రభుత్వం గతేడాది డిసెంబర్‌లో ఈ ఒప్పందాన్ని రద్దు చేయడంతో భక్తులతో కళకళలాడే బస్సులు మూలకు చేరుతున్నాయి. రాష్ట్రంలో దాదాపుగా 30 టూరిజం బస్సులుండగా.. ఇందులో కేవలం 10 బస్సులు మాత్రమే నడస్తున్నాయి. మిగిలిన 20 బస్సులు నిరుపయోగంగా ఉంటున్నాయి.  అయితే, ఈ బస్సులు కనీస నిర్వహణ లేకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంటున్నాని ఆ శాఖ ఉద్యోగులు పేర్కొంటున్నారు. 

దర్శనాల రద్దుతో ఎఫెక్ట్​..
రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ 2015లో టీటీడీతో ఒప్పందం కుదుర్చుకున్నది.  ఒప్పందం ప్రకారం టీజీటీడీసీ వద్దనే తిరుమలకు రాకపోకలు, దర్శనం, వసతికి సంబంధించిన టికెట్‌ కొనుగోలు చేస్తే సరిపోయేది. టికెట్‌ ద్వారా వచ్చిన సొమ్ములో కొంత ఒప్పందం ప్రకారం టీజీటీడీసీ  టీటీడీకి చెల్లించేది.  హైదరాబాద్ నుంచి తిరుపతికి రోజూ రెండు నుంచి మూడు బస్సులు నడిచేవి. ప్రతిరోజూ 130 నుంచి 145 మంది వరకు భక్తులు, పర్యాటకులు దర్శనానికి వెళ్లేవారు. హైదరాబాద్ లో సాయంత్రం 5.30 గంటలకు బస్సు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.00 గంటల వరకు తిరుపతికి చేరుకునేది.  పర్యాటకులకు స్వామివారి శ్రీఘదర్శనం చేయించిన తర్వాత ఇతర పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లి మళ్లీ హైదరాబాద్​కు  తీసుకొచ్చేవారు. ఏసీ ఓల్వో బస్సుకు పెద్దలకు ఒక్కరికి టిక్కెట్ రూ.3,800, పిల్లలకు 3,040 టికెట్​ తీసుకునేవారు. 

ఈ ప్యాకేజీలోనే తిరుపతిలో స్వామివారి దర్శనంతోపాటు వసతి, దర్శనం కల్పించారు.  ఫుడ్ ఖర్చులు ఎవరికి వారే భరించాలి. ప్రతి శుక్రవారం, శనివారం ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఉండేది. తిరుపతి, తిరుమల, తిరుచానూర్, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీనివాస మంగాపురం, కపిల తీర్థం తీసుకెళ్లేవారు.  బస్‌, దర్శనం టికెట్ల బుకింగ్‌, వసతి కోసం ఇబ్బందులు పడాల్సిన అవసరం లేకుండా సులభంగా ఉండటంతో చాలామంది  భక్తులు టూరిజం ద్వారా తిరుపతికి వెళ్లేవారు.  కానీ ఏపీలో చంద్రబాబు సర్కారు వచ్చిన తర్వాత ఈ ప్యాకేజీని టీటీడీ రద్దు చేయడంతో టీజీటీడీసీకి చెందిన బస్సులు ఖాళీగా ఉంటున్నాయి.  డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారు. టీజీటీడీసీకి నెలనెలా వచ్చే  రూ.కోటి ఆదాయమూ కోల్పోవాల్సి వస్తున్నది. ఇప్పటివరకు సుమారు రూ.10 నుంచి రూ.15 కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్లు  అధికారులు అంచనా వేస్తున్నారు.  

కేవలం అరుణాచలం టూర్​ ప్యాకేజీ మాత్రమే.. 
టూరిజం శాఖకు చెందిన 30 బస్సుల్లో దాదాపు 20 బస్సులు నిరుపయోగంగా ఉంటున్నాయి. ప్రస్తుతం అరుణాచలం టూర్ ప్యాకేజీ మాత్రమే అందుబాటులో ఉంది.  ఇతర రాష్ట్రాల్లోని టూరిజం శాఖలు వినూత్న ప్యాకేజీలతో పర్యాటకులను ఆకర్షిస్తుంటే.. మన రాష్ట్రంలో మాత్రం పాత పద్ధతులతోనే కాలం వెళ్లదీస్తుండటం విశేషం. కర్ణాటకలోని బెంగుళూరు, మైసూరు, కూర్గ్, కేరళ, ఊటి, కొడైకెనాల్ వంటి ఇతర ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు ప్యాకేజీ టూర్లు లేకపోవడం గమనార్హం. 

గతంలో తిరుపతి నుంచి బెంగళూరు, మైసూరు, ఊటి, కొడైకెనాల్ వంటి పర్యాటక ప్రాంతాలకు బస్సులు నడిచేవి. కానీ, ప్రస్తుతం వాటిని నిలిపివేయడం పర్యాటక శాఖ నిర్లక్ష్యానికి నిదర్శనం.  ఆదాయం కోల్పోతున్నా.. బస్సులు ఖాళీగా ఉంటున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శలొస్తున్నాయి. పర్యాటక రంగాన్ని పునరుద్ధరించడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని కోరుతున్నారు.  కాగా, పర్యాటకులు నిరాశకు గురవడమే కాకుండా టూరిజంపై ఆధారపడిన చిన్న వ్యాపారులు, గైడ్‌లు, హోటళ్లు తీవ్రంగా నష్టపోతున్నాయి.