బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోసం ఇదీ 3 నెలల కార్యాచరణ

బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోసం ఇదీ 3 నెలల కార్యాచరణ
  • డిసెంబర్ రెండో వారంలో నిరసనలు: బీసీ నేతలు
  • హైదరాబాద్​లో భారీ బహిరంగ సభ
  • 3 నెలల కార్యాచారణ ప్రకటించిన బీసీ జేఏసీ
  • హాజరైన వివిధ పార్టీల నేతలు

హైదరాబాద్, వెలుగు: బీసీల 42 శాతం రిజర్వేషన్ బిల్లును సాధించే లక్ష్యంతో డిసెంబర్ రెండో వారంలో పార్లమెంట్ ను ముట్టడిస్తామని బీసీ జేఏసీ ప్రకటించింది. ఈ పోరాటాన్ని పల్లె పల్లెకూ విస్తరింపజేస్తామని, అన్ని పార్టీల్లో ఉన్న నేతలు జెండాలు పక్కనపెట్టి ఒకటే ఎజెండాగా కలిసి కొట్లాడాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశంలోనే రాజ్యాంగ సవరణ చేసి బీసీ రిజర్వేషన్ల చట్టానికి ఆమోదం తెలపాల్సిందేనని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల సాధనకు బీసీలంతా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రత్యక్ష పోరాటానికి సిద్ధపడాలని పిలుపునిచ్చారు. అఖిలపక్ష పార్టీల నేతలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లీడర్లు కలిసి రాబోయే 3 నెలల పాటు చేపట్టబోయే ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కళింగ కల్చరల్ సెంటర్ లో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన రిజర్వేషన్ల పెంపు, భవిష్యత్ కార్యాచరణపై రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం జరిగింది. 

ఇదీ 3 నెలల కార్యాచరణ
42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదం కోసం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టబోయే 3 నెలల కార్యాచరణను బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. నవంబర్ 6న పూలే, అంబేద్కర్ విగ్రహాల ముందు బీసీల మౌన దీక్షలు, 13న పల్లె నుంచి పట్నం వరకు ‘‘బీసీల ధర్మపోరాట దీక్షలు’’, 16న రన్ ఫర్ సోషల్ జస్టిస్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, నవంబర్ 18న పార్లమెంటు సభ్యులపైన ఒత్తిడి పెంచడానికి ‘ఎంపీలతో బీసీల ములాఖత్’, 23న బీసీ రిజర్వేషన్లపై అఖిలపక్ష పార్టీల సమావేశం, డిసెంబర్ మొదటి వారంలో బీసీల చలో ఢిల్లీ పేరుతో ‘పార్లమెంటు ముట్టడి’, అదే నెల మూడోవారం నుంచి పల్లె టు పట్నం వరకు బీసీల బస్సు యాత్ర, జనవరి 4వ వారంలో లక్షలాది మందితో ‘వేలవృత్తులు- కోట్ల గొంతులు’అనే నినాదంతో హైదరాబాద్​లో బహిరంగ సభ నిర్వహణ వంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు ఆయన తెలిపారు. 

సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, బీసీ జేఏసీ కో చైర్మన్ దాసు సురేశ్,   మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్, సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి, సినీ దర్శకులు ఎన్.శంకర్, తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు జూలురీ గౌరీశంకర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చోల్లేటి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ఉద్యమ తరహాలో పోరాటం
బీసీల 42% రిజర్వేషన్ల బిల్లుల ఆమోదం కోసం తెలంగాణ ఉద్యమ తరహాలో పోరాటం చేయాలని మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. ‘‘దశాబ్దాలుగా బీసీలు రాజకీయంగా అన్యాయానికి గురవుతున్నారు. పార్టీలకు అతీతంగా బీసీ నేతలందరూ సామాజిక న్యాయం కోసం పోరాడాలి. ‘ఇప్పుడు కాకపోతే.. ఇంకెప్పుడు కాదు’ అనే రీతిలో అందరూ ఒక్కటై ఉద్యమించాలి. బీఆర్ఎస్ నేతలుగా, బీసీ బిడ్డలుగా బీసీ జేఏసీ ఉద్యమానికి మా మద్దతు ఉంటది’’అని వారు అన్నారు. బీసీలు తెలంగాణలో ఒంటరి కాదని.. బీసీ సమాజానికి సకలజనులు అండగా నిలబడతారని మొన్న జరిగిన రాష్ట్ర బంద్ తో స్పష్టమైందని కాంగ్రెస్​ నేత, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు.

బీసీ ఉద్యమానికి ఎస్సీ, ఎస్టీ, ఆదివాసి, గిరిజన, మైనార్టీలు అండగా ఉంటారని తెలిపారు. బీసీ ఉద్యమానికి ఎమ్మార్పీఎస్ వెన్నంటి ఉంటుందని, బయట నుంచి మద్దతు ఇవ్వకుండా బీసీ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనడానికి తాము సిద్ధంగా ఉన్నామని మందకృష్ణ మాదిగ ప్రకటించారు. తరతరాలుగా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దడానికి అంబేద్కర్, ఫూలే చూపించిన మార్గంలో బీసీలు ఐక్యమైగల్లీ నుండి ఢిల్లీ వరకు దండుగట్టాలని పిలుపునిచ్చారు.