6 నెలలు జైల్లో ఉన్నా.. నన్ను ఇంకా కష్టపెడ్తరా?..నాపై కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నరు: కల్వకుంట్ల కవిత

6 నెలలు జైల్లో ఉన్నా.. నన్ను ఇంకా కష్టపెడ్తరా?..నాపై కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నరు: కల్వకుంట్ల కవిత
  • టైం వచ్చినప్పుడు అన్నీ బయటపడ్తయ్ 
  • నన్ను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్త
  • నాపై జరుగుతున్న దుష్ప్రచారంపై పార్టీ స్పందిస్తదని అనుకుంటున్న
  • ప్రభుత్వ భూములను స్టాక్​ఎక్స్చేంజీల్లో రేవంత్ కుదువ పెడుతున్నారని ఆరోపణ

హైదరాబాద్, వెలుగు: తనపై కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని, సమయం వచ్చినప్పుడు అన్నీ బయటకు వస్తాయని బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ‘నేను 6 నెలలు జైల్లో ఉన్నది సరిపోదా? ఇంకా కష్టపెడతారా?’ అని ప్రశ్నించారు. తనను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తానని హెచ్చరించారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై పార్టీ స్పందిస్తుందనుకుంటున్నానని అన్నారు. సోమవారం తెలంగాణ భవన్​లో కవిత మీడియాతో మాట్లాడారు.

తాను బీఆర్ఎస్​ పార్టీ బలోపేతం కోసమే పనిచేస్తున్నానని చెప్పారు. 47 నియోజకవర్గాల్లో తన పర్యటన సందర్భంగా వచ్చిన అభిప్రాయాలనే చెబుతున్నానని తెలిపారు. ఉన్న పరిస్థితుల ఆధారంగానే సామాజిక తెలంగాణ అంశాన్ని ప్రస్తావించానని చెప్పారు. పార్టీపై ప్రజల్లో ప్రస్తుతం నమ్మకం పెరుగుతున్నదని, ఇలాంటి టైమ్​లో తనపై దుష్ప్రచారం సరికాదన్నారు.  

1.75 లక్షల ఎకరాలు తాకట్టుపెట్టే యత్నం

రాష్ట్రంలోని ప్రభుత్వ భూములను సీఎం రేవంత్​రెడ్డి స్టాక్​ ఎక్స్చేంజీలో కుదువబెడుతున్నారని కవిత ఆరోపించారు. 1.75 లక్షల ఎకరాల భూములను టీజీఐఐసీ (తెలంగాణ ఇండస్ట్రియల్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ కార్పొరేషన్​ లిమిటెడ్​) ద్వారా తాకట్టు పెట్టే ప్రయత్నాలకు తెరలేపారన్నారు. ప్రైవేట్​లిమిటెడ్​ కంపెనీ అయిన టీజీఐఐసీని పబ్లిక్​ లిమిటెడ్​ కంపెనీగా మారుస్తూ రేవంత్​ సర్కారు రహస్య జీవోను విడుదల చేసిందన్నారు.

టీజీఐఐసీ హోదాను మార్చడం ద్వారా వేల కోట్ల రూపాయల అదనపు రుణాలు సేకరించాలన్నదే  ప్రభుత్వ ఎజెండా అని ఆరోపించారు. రహస్యంగా, దొంగచాటు జీవో జారీ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల సంపద అయిన భూములను స్టాక్ ఎక్స్చేంజీలో ఎందుకు తాకట్టు పెడుతున్నారని  ప్రశ్నించారు. స్టాక్​ ఎక్స్చేంజీలో నష్టం జరిగితే ఆ భూముల భవిష్యత్​ ఏంటని అడిగారు. 

16 నెలల్లో 1.80 లక్షల కోట్ల అప్పు

కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే రూ.1.80 లక్షల కోట్లకుపైగా అప్పులు తెచ్చారని, అయినా ఏ ఒక్క స్కీమ్‌ను సంపూర్ణంగా అమలు చేయలేదని కవిత విమర్శించారు. కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం ఇవ్వలేదని, మహాలక్ష్మి పథకాన్ని అసంపూర్ణంగా వదిలేశారని విమర్శించారు. మహిళలు నెలకు రూ.2,500 కోసం ఎదురుచూస్తున్నారన్నారు. గతంలో చేసిన అప్పులకు కాంగ్రెస్​ సర్కారు చెల్లించింది కేవలం రూ.80 వేల కోట్లేనని చెప్పారు.

మిగతా రూ.లక్ష కోట్లను కమీషన్లు తీసుకుని కాంట్రాక్టర్లకు ఇచ్చారని ఆరోపించారు. తాను పూర్తి ఆధారాలతో ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టు తెలిపారు. ఇది 20% కమీషన్​ సర్కారు అని అన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి.. రేవంత్​ రూ.20 వేల కోట్ల కమీషన్లు తీసుకున్నారన్నారు. కేబినెట్‌‌‌‌‌‌‌‌ మంత్రికి చెందిన సొంత కాంట్రాక్టు సంస్థకు, మేఘా కంపెనీకి బిల్లులు చెల్లించడం మినహా రేవంత్‌‌‌‌‌‌‌‌ చేసిన అభివృద్ధి అంటూ ఏమీ లేదన్నారు.