- ‘తెలంగాణ ప్రజా జాగృతి’గా పేరు ఖరారు
- రేపు నిజామాబాద్‌లో ప్రకటించనున్న కవిత
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటుకు ముహూర్తం దాదాపు ఫిక్స్అయింది. పార్టీ పేరు, సింబల్, పార్టీ ఏర్పాటు తేదీపై క్లారిటీ వచ్చింది. ఏప్రిల్25న కవిత పార్టీని అధికారికంగా ఏర్పాటు చేయబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో పార్టీని ఏర్పాటు చేయనున్నారు. ధర్మగంటను పార్టీ గుర్తుగా ఎన్నికల కమిషన్‌కు అప్లికేషన్పెట్టుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతున్నది.
ఇందుకు సంబంధించిన వివరాలను శ్రీరామనవమి పండుగ (శుక్రవారం) నిజామాబాద్‌లోని జాగృతి ఆఫీస్‌లో కవిత వెల్లడించనున్నట్టు తెలిసింది. పార్టీ పేరు, ఎజెండా, తాను పోటీ చేసే సెగ్మెంట్‌పై క్లారిటీ ఇస్తారని జాగృతి వర్గాలు తెలిపాయి.
ఓబీసీ కోటా ఇవ్వాలి
చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కల నెరవేరే సమయం ఆసమన్నమవుతున్న తరుణంలో సామాజిక న్యాయాన్ని కూడా పాటించాలని కవిత డిమాండ్‌చేశారు. రిజర్వేషన్లతో పాటు మహిళలకు ఓబీసీ కోటా కూడా ముఖ్యమని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ల అమలు బిల్లును ప్రస్తుత లోక్ సభ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో కవిత స్పందించారు. మహిళా బిల్లులో ఓబీసీ మహిళలకు ఉప కోటా కల్పించకపోతే మెజారిటీ ప్రజలను మోసం చేయడమేనన్నారు.
చట్టసభల్లో సామాజిక సమానత్వం రావాలంటే ఓబీసీ మహిళల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలన్నారు. మహిళలకు ఓబీసీ కోటా లేకుండానే రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్రం భావిస్తే మరోపోరాటం తప్పదని హెచ్చరించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం రాజకీయ పార్టీలు, మహిళ సంఘాలను ఏకం చేసి ఢిల్లీలో దీక్ష చేశామో.. అలాగే మరోసారి పోరాటం చేస్తామన్నారు.
