పాలమూరు ప్రాజెక్ట్ బ్లాస్టింగ్ లతో కల్వకుర్తి పంపుహౌస్ మునిగింది

పాలమూరు ప్రాజెక్ట్ బ్లాస్టింగ్ లతో కల్వకుర్తి పంపుహౌస్ మునిగింది
  • మూడో మోటర్ నుంచి ఉబికి వస్తున్న నీళ్లు
  • బేస్‌మెంట్‌ పగిలిపోయినట్టు అనుమానం
  • ప్రభుత్వ నిర్వాకంతోనే ఈ దుస్థితి అంటున్న ఇంజనీర్లు

హైదరాబాద్‌, వెలుగు: కల్వకుర్తి (ఎల్లూరు) పంపుహౌస్‌  నీట మునిగిపోయింది. ప్రభుత్వ నిర్వాకంతో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. పాలమూరు – రంగారెడ్డి ఫస్ట్‌ పంపుహౌస్‌తో పాటు అప్రోచ్‌ చానల్‌ కోసం భూగర్భంలో చేపట్టిన పేలుళ్లతోనే ఈ ప్రమాదం జరిగింది. కల్వకుర్తి పంపుహౌస్​లో  డ్రాఫ్ట్‌ ట్యూబ్‌లను ఆనుకొని ఉన్న గోడల్లో పగుళ్లు వచ్చి మోటార్లు మొత్తం నీటిలో మునిగిపోయాయి. మూడో మోటారు దెబ్బతిని దాని నుంచి నీళ్లు పైకి ఉబికి వస్తున్నాయి. మూడో మోటారు బేస్మెంట్‌ కూడా పగిలిపోయినట్టు తెలుస్తున్నది. పాలమూరు ప్రాజెక్టులో అండర్‌ గ్రౌండ్‌ పంపుహౌస్‌ నిర్మిస్తే కల్వకుర్తి పంపుహౌస్‌ దెబ్బతింటుందని సీనియర్‌ ఇంజనీర్లు హెచ్చరించినా.. రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది.

పంపుహౌస్‌‌లో శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత ఒక్కసారిగా భారీ పేలుడు లాంటి శబ్దం వినిపించడంతో అక్కడే ఉన్న ఇంజనీర్లు, సిబ్బంది బయటకు పరుగులు తీశారు. కాసేపటి తర్వాత లోపలికి వెళ్లి చూడగా మూడో మోటారు నుంచి భారీగా నీళ్లు ఉబికి వస్తుండటంతో వాటిని ఎలా కంట్రోల్‌‌ చేయాలో అర్థంకాక సీనియర్​ ఆఫీసర్లకు  సమాచారం ఇచ్చారు. అప్పటికే పంపుహౌస్‌‌ మొత్తం మునిగిపోవడంతో అదే విషయాన్ని మహబూబ్‌‌నగర్‌‌ ప్రాజెక్టుల సీఈతో పాటు ఇతర ఆఫీసర్లకు తెలియజేశారు. మూడో మోటారు పైభాగం నీళ్ల ఉధృతికి పగిలిపోయినట్టుగా అనుమానిస్తున్నారు. ఆ మోటారు నుంచే నీళ్లు పంపుహౌస్‌‌లోకి చేరాయని ప్రిలిమినరీ అంచనాకు వచ్చారు. మూడో మోటారు కింద ఫౌండేషన్‌‌ కూడా దెబ్బతిన్నట్టుగా అనుమానిస్తున్నారు. పంపుహౌస్‌‌లో నీటిని మొత్తం తీసేస్తేగాని అసలు ఏం జరిగిందో చెప్పలేమని ఓ ఆఫీసర్​ అన్నారు. పంపుహౌస్‌‌లో 60  మీటర్ల ఎత్తులో నీళ్లు నిలిచి ఉన్నాయని చెప్తున్నారు. ఎల్లూరు సర్జ్‌‌పూల్‌‌లోకి నీటిని తరలించే అప్రోచ్‌‌ చానల్‌‌ షటర్స్‌‌ మూసేసినా పంపుహౌస్‌‌లోకి నీళ్లు వస్తూనే ఉన్నాయి.

అండర్‌‌ గ్రౌండ్‌‌ పంపు హౌస్​ వద్దన్నా..!

కల్వకుర్తి లిఫ్ట్‌‌ స్కీం మొదటి పంపుహౌస్‌‌ ఎల్లూరుకు 400 మీటర్ల దూరంలోనే పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు ఫస్ట్‌‌ పంపుహౌస్‌‌ను ప్రపోజ్‌‌ చేశారు. అక్కడ మొదట ఓపెన్‌‌ పంపుహౌస్‌‌ను ప్రతిపాదించినా ప్రభుత్వం గుత్తేదారుకు మేలు చేకూర్చేందుకే దాన్ని అండర్‌‌ గ్రౌండ్‌‌గా మార్చినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. పాలమూరు పంపుహౌస్‌‌ కోసం చేపడుతున్న డ్రిల్లింగ్‌‌, బ్లాస్టింగ్స్‌‌తో కల్వకుర్తి పంపుహౌస్‌‌లో ప్రకంపనలు వస్తున్నాయని ప్రాజెక్టు ఇంజనీర్లు ఇరిగేషన్‌‌ శాఖ ఉన్నతాధికారులకు కంప్లైంట్‌‌ చేశారు. దానిపై విచారణకు ఏర్పాటు చేసిన ఎక్స్‌‌పర్ట్‌‌ కమిటీ 2016లో ఫీల్డ్‌‌ విజిట్‌‌ చేసి అండర్‌‌ గ్రౌండ్‌‌ పంపుహౌస్‌‌ చేపట్టవద్దని ప్రభుత్వానికి రిపోర్ట్‌‌ ఇచ్చింది. అప్పటికే అండర్‌‌ గ్రౌండ్‌‌ పంపుహౌస్‌‌ నిర్మించేందుకు వర్క్‌‌ ఏజెన్సీకి గ్రీన్‌‌ సిగ్నల్‌‌ ఇచ్చిన ప్రభుత్వం.. అదే కమిటీతో రెండు రోజుల్లో మరో రిపోర్ట్‌‌ తయారు చేయించింది. కోర్‌‌ డ్రిల్లింగ్‌‌ చేస్తే కల్వకుర్తికి ఇబ్బంది ఉండబోదని రెండో రిపోర్ట్‌‌  ఇప్పించింది. అండర్​ గ్రౌండ్​ పంపుహౌస్​ వద్దని ఎక్స్‌‌పర్ట్‌‌ కమిటీ చెప్పినా ప్రభుత్వం పట్టించుకోకుండా వర్క్‌‌ ఏజెన్సీకి లాభం చేకూర్చడానికి ముందుకు వెళ్లడంతోనే కల్వకుర్తి పంపుహౌస్‌‌లో భారీ ప్రమాదం జరిగిందన్న విమర్శలు వస్తున్నాయి.

ఈ యేటికింతే

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణ నీళ్లు తీసుకునేది ఒక్క కల్వకుర్తి నుంచే. ఈ పంపుహౌస్‌‌లోని నాలుగు మోటార్ల ద్వారా 2,400 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుంది. మరో మోటారును స్టాండ్‌‌ బైగా ఏర్పాటు చేశారు. ఈ ఏడాది కృష్ణాలో భారీగా వరదలు వస్తున్నా కల్వకుర్తిని పెద్దగా ఆపరేట్‌‌ చేయలేదు. ఆపరేటర్లకు కరోనా రావడంతో పంపులు బంద్‌‌ పెట్టారు. ఇప్పుడు మొత్తం పంపుహౌస్‌‌ మునిగిపోవడంతో ఈ ఏడాది అది వినియోగంలోకి వచ్చే అవకాశమే లేదు. శ్రీశైలంలో పూర్తి స్థాయిలో నీళ్లుండటంతో పంపుహౌస్‌‌ నుంచి నీటిని తోడేయడం ఇప్పట్లో సాధ్యమయ్యే పనికాదని ఇంజనీర్లు చెప్తున్నారు. శ్రీశైలంలో నీటి మట్టం తగ్గితేనే నీటిని తొలగించి మోటార్లు బయటికి తీస్తామని అంటున్నారు. ఆ తర్వాత పంపుహౌస్‌‌ బేస్‌‌మెంట్‌‌తో పాటు సర్జ్‌‌పూల్‌‌ గోడలకు ఏర్పడిన పగుళ్లకు రిపేర్లు చేయాల్సి ఉంటుందని, ఇందుకోసం ఎండాకాలం వరకు వేచి చూడక తప్పదని చెప్తున్నారు. వచ్చే వానాకాలంలో త్వరగా వర్షాలు కురిస్తే వచ్చే యేడు కూడా పంపుహౌస్‌‌ అందుబాటులోకి రాకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వరుస ప్రమాదాలు..

ఇటీవల శ్రీశైలం లెఫ్ట్‌‌ పవర్‌‌ హౌస్‌‌లో అగ్ని ప్రమాదంతో హైడల్‌‌ పవర్‌‌ జనరేషన్‌‌ పూర్తిగా నిలిచిపోయింది. పవర్‌‌ స్టేషన్‌‌లో రిపేర్లు పూర్తి చేశామని, త్వరలోనే కరెంట్‌‌ ఉత్పత్తి మొదలు పెడుతామని జెన్‌‌కో ఆఫీసర్లు చెప్తున్నారు. అది ఇంకా వినియోగంలోకి రాకముందే శ్రీశైలంపైనే ఆధారపడి నిర్మించిన కల్వకుర్తి పంపుహౌస్‌‌ నీట మునగడంతో ఈ యేడు శ్రీశైలం నుంచి చుక్క నీటిని కూడా వినియోగించుకోలేని దుస్థితిలోకి రాష్ట్రం వెళ్లింది. ప్రభుత్వం దూరదృష్టితో కాకుండా కొందరు కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చడానికి ప్రాధాన్యం ఇవ్వడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందన్న విమర్శలు వస్తున్నాయి.

‘పాలమూరు’ పేలుళ్లతోనే

కల్వకుర్తి పంపుహౌస్‌‌కు 400 మీటర్ల దూరంలోనే పాలమూరు ప్రాజెక్టు మొదటి పంపుహౌస్‌‌ నిర్మిస్తున్నారు. దీనికోసం భూగర్భంలో డ్రిల్లింగ్‌‌ చేసి డైనమేట్లతో బ్లాస్టింగ్‌‌ చేస్తున్నారు. దీనితో కల్వకుర్తి పంపుహౌస్‌‌ సర్జ్‌‌పూల్‌‌, పంపుహౌస్‌‌లో పగుళ్లు ఏర్పడ్డాయి. దీనికి తోడు పాలమూరు పంపుహౌస్‌‌కు నీటిని తరలించేందుకు కల్వకుర్తి పంపుహౌస్‌‌కు 250 మీటర్ల దూరంలోనే అప్రోచ్‌‌ చానల్‌‌ పనులు చేస్తున్నారు. దీనికోసం చేస్తున్న డ్రిల్లింగ్‌‌, బ్లాస్టింగ్‌‌తోనూ సర్జ్‌‌పూల్‌‌ దెబ్బతిన్నట్టుగా ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. సర్జ్‌‌పూల్‌‌ నుంచి పంపులకు నీటిని అందించే డ్రాఫ్ట్‌‌ ట్యూబుల్ని ఆనుకుని ఉన్న గోడల్లో పగుళ్లు ఉన్నట్టు అనుమాని స్తున్నారు. శ్రీశైలంలో పూర్తిగా నీళ్లు నిల్వ ఉండటం, భారీ వరద పోటెత్తుతుండటంతో రాళ్ల మధ్య ఏర్పడ్డ ఖాళీల నుంచి సర్జ్‌‌పూల్‌‌లోకి ఊట వచ్చి పంపులపై ప్రెషర్​ పెంచినట్టు తెలుస్తున్నది. ఆ ఉధృతి కారణంగానే మూడో మోటారు నుంచి నీళ్లు తీవ్రమైన ప్రెజర్‌‌తో పైకి ఉబికి వచ్చి భారీ పేలుడు లాంటి శబ్దం వచ్చిందని ఇంజనీర్లు అంటున్నారు.

ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట: రేవంత్‌‌రెడ్డి

కల్వకుర్తి పంపు హౌస్​ మోటార్లు నీళ్లలో మునగడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని కాంగ్రెస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌,  ఎంపీ రేవంత్‌‌రెడ్డి  ట్వీట్​ చేశారు. ‘‘కొల్లాపూర్‌‌లో ఎల్లూరు రిజర్వాయర్‌‌ మోటార్లు నీళ్లలో మునిగినట్లు స్థానికుల సమాచారం. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట. జరిగిన ప్రమాదాన్ని కప్పి పుచ్చకుండా కారకులపై  కఠిన చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్​ చేశారు.

నీళ్లను తోడేస్తె గానీ చెప్పలేం: మంత్రి నిరంజన్​రెడ్డి

కల్వకుర్తి (ఎల్లూరు) పంప్ హౌస్ నుంచి నీళ్లను పూర్తిగా తోడేస్తే గానీ సమస్య బయటపడదని వ్యవసాయ మంత్రి నిరంజన్​రెడ్డి చెప్పారు. ప్రాబ్లమ్ తెలియగానే నెల రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నీట మునిగిన ఎల్లూరు పంప్​హౌస్​ను మంత్రి శుక్రవారం పరిశీలించారు. తాగు నీటి అవసరాల కోసం
(మిషన్ భగీరథ) ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల 54 నిమిషాలకు ఎల్లూరులోని తొలి పంపు స్టార్ట్ చేశామని, రెండో పంపును 3.45 గంటలకు ప్రారంభించామని మంత్రి చెప్పారు. స్టార్టయిన మూడు నిమిషాల్లోనే పంపుల నుంచి పెద్ద సౌండ్స్​తో పంప్​ హౌస్​లోకి నీళ్లొచ్చాయని, 20 నిమిషాల్లోనే పంప్ హౌస్ నీట మునిగిందని అన్నారు. పంప్ హౌస్​లోకి నీళ్లు రాకుండా ఇంజనీర్లు వెంటనే సర్జ్​పూల్ గేట్లు మూసేశారన్నారు. ఈ సమస్యతో రైతులకు ఇబ్బంది రాకుండా చూస్తామని చెప్పారు. ఎల్లూరు, సింగోటం, జొన్నలబొగుడ, గుడిపల్లి రిజర్వాయర్లు నిండుగా ఉన్నాయని.. రిజర్వాయర్ల లోని నీటిని పొదుపుగా వాడుకుంటూ రైతులకు నీరందిస్తామన్నారు.