Rashid Khan: 5 బంతుల్లో 26 పరుగులు.. హండ్రెడ్ లీగ్‌లో రషీద్ ఖాన్ అత్యంత చెత్త బౌలింగ్

Rashid Khan: 5 బంతుల్లో 26 పరుగులు.. హండ్రెడ్ లీగ్‌లో రషీద్ ఖాన్ అత్యంత చెత్త బౌలింగ్

టీ20 క్రికెట్ లో ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ వన్ ఆఫ్ ది టాప్ బౌలర్లలో ఒకడు. ఏళ్ళు గడుస్తున్నా ఈ మిస్టరీ స్పిన్నర్ ను డీకోడ్ చేయడం బ్యాటర్లకు పెద్ద సమస్యగా మారింది. అందుకే ప్రపంచంలో ఎక్కడ క్రికెట్ లీగ్ జరిగినా ఈ ఆఫ్ఘన్ స్పిన్నర్ ను పోటీ పడి మరీ తీసుకుంటారు. దశాబ్ద కాలానికి పైగా టీ20 క్రికెట్ లో తనదైన మార్క్ చూపిస్తు వస్తున్నాడు. ఇప్పటికీ రషీద్ ఖాన్ స్పిన్ బ్యాటర్లకు ఒక సవాలే. తన స్పిన్ మాయాజాలంతో టీ20 క్రికెట్ లో ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకున్న రషీద్ ఖాన్ కు ఈ ఏడాది (2025) కష్టకాలం కొనసాగుతోంది. లీగ్ ఏదైనా రషీద్ ను అలవోకగా ఆడేస్తున్నారు. 

ప్రస్తుతం ఇంగ్లాండ్ లో జరుగుతున్న హండ్రెడ్ లీగ్ లో రషీద్ తన పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. మంగళవారం (ఆగస్టు 12)  బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన హండ్రెడ్ లీగ్ మ్యాచ్ లో రషీద్ ఖాన్‌ ఘోరంగా విఫలమయ్యాడు. ఓవల్ ఇన్విన్సిబుల్స్ తరపున ఆడుతున్న రషీద్ ఖాన్ తన 20 బంతుల్లో ఏకంగా 59 పరుగులు సమర్పించుకున్నాడు. బర్మింగ్ హోమ్ హామ్ ఫీనిక్స్ లియామ్ లివింగ్‌స్టోన్ రషీద్ వేసిన ఓవర్లో 5 బంతుల్లోనే మూడు సిక్సర్లు, రెండు ఫోర్లతో 26 పరుగులు రాబట్టాడు. రషీద్ తన మొదటి ఐదు బంతుల్లో 8 పరుగులు ఇచ్చాడు. ఆ తర్వాత 15 బంతుల్లో 51 పరుగులు బాదారు.  

రషీద్ ఖాన్ టీ20 చరిత్రలో ఇవే అత్యంత చెత్త గణాంకాలు. ఐపీఎల్ 2018లో పంజాబ్ కింగ్స్ పై సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన ఈ ఆఫ్ఘన్ స్పిన్నర్ 55 పరుగుల తన చెత్త రికార్డును బ్రేక్ చేసుకున్నాడు. హండ్రెడ్ లీగ్ లో కూడా అత్యధిక పరుగులు ఇచ్చిన ఆటగాడిగా నిలిచాడు. 26 ఏళ్ల రషీద్ ఖాన్ ఇటీవలే జరిగిన ఐపీఎల్ సీజన్ 2025లో పెద్దగా రాణించలేదు. 15 మ్యాచ్‌లలో 57.11 సగటుతో 9 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగాడు. ఐపీఎల్ లో విఫలమైనా హండ్రెడ్ లీగ్ లో అదే పేలవ ఆట తీరును కొనసాగిస్తున్నాడు. ఇదే టోర్నీలో టీ20 ఫార్మాట్ లో 650 వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా రషీద్ ఖాన్ చరిత్ర పుటల్లో తన పేరును లిఖించుకున్నాడు. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన ఓవల్ ఇన్విన్సిబుల్స్ 100 బంతుల్లో 180 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది.  డోనోవన్ ఫెర్రీరా (29 బంతుల్లో 63), జోర్డాన్ కాక్స్ (30 బంతుల్లో 44) మెరుపులు మెరిపించి జట్టుకు భారీ స్కోర్ అందించారు. ట్రెంట్ బౌల్ట్ (2/20), ఆడమ్ మిల్నే (2/28) చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ 98 బంతుల్లో 181 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసి గెలిచింది. లివింగ్‌స్టోన్ 69* (27) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు.