హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ ఆలస్యమవుతోంది. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే అందాల్సిన చెక్కులు నెలలు గడుస్తున్నా రావడం లేదు. అన్ని జిల్లాల్లో కలిపి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పైసలు దాదాపు రూ.850 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. 85 వేల మంది చెక్కుల కోసం ఎదురుచూస్తున్నారు. ఒక్కో చోట ఏడాది తర్వాత చెక్కులు అందుతున్నాయి. పెండ్లికి తెచ్చిన అప్పుల వడ్డీలకు అవి సరిపోతున్నాయని ఆడపిల్లల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. వాస్తవానికి పెండ్లికి ముందే ఆర్థిక సాయం అందాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు అప్లికేషన్ అప్రూవల్ అయ్యాక ఏడాది గడిస్తేగానీ ఫండ్స్ జమకావడం లేదు. ఇంకా ప్రాసెస్‌లో ఉన్న అప్లికేషన్లు20 వేలపైనే ఉన్నాయి.
అప్రూవ్ చేస్తున్నరు.. చెక్కులిస్తలే
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రభుత్వం గ్రీన్‌చానల్ కింద ప్రకటించినా నిధుల కొరత వెంటాడుతోంది. క్షేత్ర స్థాయి విచారణ అనంతం ఆర్థిక సాయం మంజూరైనా ట్రెజరీ బిల్లులు పెండింగ్‌లో పడిపోతున్నాయి. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ స్కీమ్‌లను సర్కారు 2014 నుంచి అమలు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాలకు చెందిన వధువులకు రూ. 1,00,116 సాయంగా అందజేస్తున్నది. 2014 నుంచి ఈ ఏడాది మార్చి వరకు గిరిజన కుటుంబాలకు చెందిన సుమారు 8 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో 90 శాతం అప్లికేషన్లలో చిన్న చిన్న తప్పులే ఉన్నా అధికారులు సరిచేసి ప్రాసెస్ చేయడం లేదు. మైనార్టీ సంక్షేమ శాఖలో 25 వేల అప్లికేషన్లు, బీసీ సంక్షేమ శాఖలో 30 వేలు, ఎస్టీ సంక్షేమ శాఖలో 16,695, ఎస్సీ అభివృద్ధి శాఖలో 10 వేలు, ఈబీసీలకు సంబంధించి మరో 3 వేల అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి.
బీఆర్వోలు ఇస్తున్నరు..పైసలిస్తలే
కల్యాణలక్ష్మికి బడ్జెట్లో పెటుకున్న మేరకు ఆర్థిక శాఖ ప్రతి ఏటా మొదటి నెలలో బీఆర్వోలను ఇస్తోంది. అయితే ఆ మేరకు నిధుల సర్దుబాటు చేయడం లేదు. పోయిన ఏడాది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ డిపార్ట్మెంట్ల కింద కల్యాణలక్ష్మి కోసం రూ.2,750 కోట్లు కేటాయించారు. ఈ మొత్తానికి ఏప్రిల్‌లోనే బీఆర్వో ఇచ్చారు. కానీ నిధులివ్వలేదు. 2023–24 కు సంబంధించి రూ.3,210 కోట్లు కేటాయింపులు చేశారు. ఇందులో బీసీ వెల్ఫేర్ నుంచి రూ.2 వేల కోట్లకు రాష్ట్ర సర్కార్ బుధవారం బడ్జెట్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ నిధులు నెలానెలా కొంత మొత్తం చెల్లింపులు చేయాలని పెట్టుకున్నారు.
పెండ్లయి ఏడాది.. చెక్కు ఇయ్యలే
నా కూతురు పెండ్లయి ఈ నెల 14కు ఏడాది అయింది. కల్యాణలక్ష్మి కోసం పెండ్లయిన నెలకే అప్లికేషన్ పెట్టినం. ఇంకా చెక్కు రాలే. ఎమ్మార్వో ఆఫీసులో అడిగితే.. పైనుంచి పైసలు రాలేదంటున్నరు. ఎమ్మెల్యే దగ్గర ఉన్నోళ్లను అడిగితే లక్ష రూపాయలు ఉట్టిగనే వస్తయా.. వచ్చేదాకా ఆగలేవా అని దబాయిస్తున్నరు.
- నాగమణి, కొత్తగూడెం జిల్లా
ఆర్డీఓ పీడీ అకౌంట్లో ఉన్నయ్ అంటున్నరు
నా పెండ్లి మే నెలలో జరిగింది. పెండ్లికి చేసిన అప్పుకు అమ్మ వాళ్లు నెలనెలా మిత్తీ కడ్తున్నరు. ఇంకా చెక్కు రాలే. పైసలు ఆర్డీఓ అకౌంట్లో ఉన్నాయని.. చెక్కు రావడానికి టైమ్పడుతుందని చెప్తున్నరు. చెక్కు డబ్బులు చేసిన అప్పుల మిత్తీలకే అవి సరిపోయేటట్టున్నాయి. పెండ్లి అయిన 15 రోజులకే చెక్కులు ఇస్తున్నామనేది ఉట్టి మాటే.
- అర్చన, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా