‘అమిగోస్‌‌’లో బాలయ్య పాట రీమిక్స్

‘అమిగోస్‌‌’లో బాలయ్య పాట రీమిక్స్

డిఫరెంట్ కాన్సెప్ట్‌‌ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్క్ చూపిస్తున్న కళ్యాణ్‌‌ రామ్, త్వరలో ‘అమిగోస్‌‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఆషికా రంగ‌‌నాథ్ హీరోయిన్‌‌.రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. న‌‌వీన్ ఎర్నేని, య‌‌ల‌‌మంచిలి ర‌‌వి శంక‌‌ర్ నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 10న సినిమా విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్‌‌లో స్పీడు పెంచారు. ‘పేరుకే ఇది క్లాస్ సినిమా కానీ అభిమానులు మెచ్చే మాస్‌‌ ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయని ఇటీవల ఓ వీడియోలో క్లారిటీ ఇచ్చాడు కళ్యాణ్ రామ్. ముఖ్యంగా తన బాబాయి బాలకృష్ణ సూపర్ హిట్ సాంగ్‌‌ని రీమిక్స్ చేశామని లీక్ ఇచ్చాడు.

ఆ పాటేమిటో చెప్పనప్పటికీ, తను హమ్ చేసిన ట్యూన్‌‌ని బట్టి..‘ధర్మక్షేత్రం’ సినిమాలోని ‘ఎన్నో రాత్రులొస్తాయి కానీ’ పాటను రీమిక్స్ చేశారని అర్థమవుతోంది. అప్పట్లో ఇళయరాజా కంపోజ్ చేసిన ఈ పాటను.. ఇప్పుడు ‘అమిగోస్‌‌’ కోసం జిబ్రాన్‌‌ రీమిక్స్ చేశాడు. ఇక గతంలో కళ్యాణ్ రామ్ నటించిన ‘పటాస్‌‌’ సినిమాలోనూ బాలకృష్ణ (అరే ఓ సాంబ) పాటను రీమిక్స్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మరోసారి అలాంటి మ్యాజిక్ రిపీట్  అవుతుందేమో చూడాలి!