సైకిల్ తొక్కుతూ వెళ్లి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రసమయి

సైకిల్ తొక్కుతూ వెళ్లి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రసమయి

కళ్యాణ లక్ష్మీ, సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వినూత్న రీతిలో పంపిణీ చేశారు. తొలిపొద్దు పర్యటనలో భాగంగా కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని పలు గ్రామాలకు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వేకువజామునే  వెళ్లారు. లింగాపూర్, వెల్డి, రంగపేట, పచ్చునూర్, ఊటూర్, వేగురుపల్లి, లక్ష్మీపూర్ గ్రామాల్లో లబ్దిదారుల ఇండ్లకు నేరుగా వెళ్లి చెక్కులను పంపిణీ చేశారు.  రంగపేట గ్రామంలో ఎమ్మెల్యే రసమయి సైకిల్ తొక్కుతూ చెక్కులు అందజేశారు. ఎమ్మెల్యే రసమయి వెంట అధికారులు, టీఆర్ఎస్ కార్యకర్తలు బైక్ లపై  ఇంటింటికి తిరిగారు.

కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాలు దేశంలో ఎక్కడా లేవని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. ఈ రెండు పథకాలు పేదలకు వరంగా మారాయని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆడబిడ్డలకు మేనమామగా మారి..వివాహానికి ఆర్థికసాయం చేస్తున్నారని గుర్తు చేశారు. అటు అమ్మఒడి, కేసీఆర్ కిట్ పథకం ద్వారా గర్భిణులకు ఆర్థిక సాయం అందిస్తున్నారని తెలిపారు.