సారీ చెప్పను.. కర్ణాటకలో నా సినిమా విడుదల చేయను

సారీ చెప్పను.. కర్ణాటకలో నా సినిమా విడుదల చేయను
  • తన వ్యాఖ్యల్లో దురుద్దేశం లేదని వివరణ
  • కర్నాటకలో సినిమా విడుదలకు బ్రేక్​
  • ఒక భాష నుంచి మరో భాష పుట్టిందని ఎట్లా చెప్తరు?
  •  మీరేమైన చరిత్రకారులా, భాషా శాస్త్ర వేత్తనా.. అని హైకోర్టు ఫైర్

బెంగళూరు, చైన్నై: ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్​ హాసన్‌‌పై తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందనే వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పబోనని అన్నారు. తన వ్యాఖ్యల్లో దురుద్దేశ లేదని ఆయన పేర్కొన్నారు. తన తాజా సినిమా ‘థగ్ లైఫ్’ను కర్నాటకలో విడుదల చేయబోవడం లేదని తెలిపారు. ఈ విషయంపై కర్నాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్  కామర్స్ (కేఎఫ్‌‌సీసీ)తో చర్చలు జరుపుతానని వెల్లడించారు. కమల్ హాసన్ క్షమాపణ చెబితే వివాదం సమసిపోతుందని కర్నాటక హైకోర్టు పేర్కొన్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అసలు వివాదం ఏంటి?

కమల్ ​హాసన్ తన తాజా చిత్రం ‘థగ్ లైఫ్’ ఆడియో విడుదల కార్యక్రమంలో కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలపై కర్నాటకలో తీవ్ర వ్యతిరేకత, నిరసనలు వ్యక్తమయ్యాయి. కమల్ ​హాసన్ క్షమాపణ చెప్పకపోతే ‘థగ్ లైఫ్’ సినిమాను కర్నాటకలో విడుదల చేయడానికి అనుమతించబోమని కర్నాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(కేఎఫ్‌‌సీసీ) హెచ్చరించింది. అలాగే, ఈ సినిమాను కర్నాటకలో నిషేధించాలని కోరుతూ కర్నాటక హైకోర్టును ఆశ్రయించింది. మంగళవారం ఈ పిటిషన్‌‌ను హైకోర్టు జడ్జి జస్టిస్ ఎం.నాగప్రసన్న బెంచ్ విచారించింది. ఈ సందర్భంగా కమల్​ హాసన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ఆయన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. అలాగే కమల్ ఇచ్చిన వివరణను కోర్టుకు సమర్పించారు. అలాగే, ‘థగ్ లైఫ్’ సినిమా కర్నాటకలో అడ్డంకులు లేకుండా విడుదలయ్యేలా చూడాలని, భద్రత కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా న్యాయస్థానం కమల్​ హాసన్‌‌పై ఫైర్ అయింది. “మీరు కమల్​హాసన్ అయినా, ఎవరైనా సరే, ప్రజల మనోభావాలను గాయపరిచే హక్కు మీకు లేదు. ఈ దేశంలో చాలా రాష్ట్రాలు భాషల ఆధారంగా ఏర్పడ్డాయి. ఒక భాష మరో భాష నుంచి పుట్టిందని ఎలా చెప్పగలరు? మీరేమైనా చరిత్రకారులా, భాషాశాస్త్రవేత్తలా?” అని జస్టిస్ నాగప్రసన్న ప్రశ్నించారు. కమల్​ హాసన్ వ్యాఖ్యలకు ఆధారాలు ఏమిటని, ఈ వ్యాఖ్యల వల్ల అశాంతి , అసహనం ఏర్పడిందని మండిపడ్డారు.