
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమయం దగ్గర పడుతుండడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ పొలిటికల్ హీట్ పెంచేస్తున్నారు. ముఖ్యంగా తమిళ హీరో తళపతి విజయ్ రాజకీయ అరంగ్రేటంతో ఎన్నికల సమయం తమిళనాట సెగలు పుట్టిస్తోంది. తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీతో ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. విజయ్ బహిరంగ సభలకు తండోపతండాలుగా జనం తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో నటుడు , ఎంపీ కమల్ హాసన్ .. విజయ్ పై విమర్శలు గుప్పిస్తూ.. పలు సలహాలు కూడా ఇచ్చారు.
గ్లామర్ చూసి జనం వస్తారు.. కానీ ఓట్లు వేయకుండా వెళ్తారు.. పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చే సినిమావాళ్లు గుర్తించాల్సిన సింపుల్ లాజిక్ ఇదే అని రాజకీయ పండితులు వల్లెవేస్తున్నారు. దీనిని గుర్తుచేస్తూ.. లేటెస్ట్ గా కమల్ హాసన్ తన అనుభవపాఠాలు వివరించారు. "జనసందోహం ఎప్పుడూ ఓట్లుగా మారదు" అని వ్యాఖ్యానించారు. ఈ సూత్రం భారత రాజకీయాల్లో అందరికీ వర్తిస్తుందని, తనకు కూడా వర్తిస్తుందని ఆయన నొక్కి చెప్పారు.
గత కొన్ని నెలలుగా విజయ్ మధురై, తిరువారూర్, నాగపట్టణం వంటి ప్రాంతాల్లో నిర్వహించిన సభలకు వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు తలివస్తున్నారు. ఈ సభల్లో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ.. విమర్శలు ఎక్కుపెట్టారు. రైతుల సమస్యలు, తమిళనాడులో కుటుంబ పాలన, మౌలిక వసతుల లేమి వంటి అంశాలను ప్రధానాస్త్రంగా ప్రస్తావించారు. దశాబ్దాలుగా డీఎంకేకు కంచుకోటగా ఉన్న తిరువారూర్ ను అభివృద్ధి చేయకుండా సీఎం స్టాలిన్ చేసిన నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవినీతి, మెడికల్ కాలేజీలో సరైన సౌకర్యాలు లేకపోవడం, రోడ్లు, రైలు కనెక్టివిటీ లేకపోవడం వంటి అంశాలపై విజయ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. తన ప్రసంగాల్లో టీవీకే లక్ష్యం అవినీతి, పేదరికం, కుటుంబ పాలన లేని రాష్ట్రాన్ని నిర్మించడమే అని పదే పదే చెప్పారు. అయితే విజయ్ సభల్లో కనిపిస్తున్న ఉత్సాహపూరిత వాతావరణం పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపినా.. వాస్తవ పరిస్థితులను కూడా గుర్తు చేసుకోవాలంటూ కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కేవలం ప్రజాదరణ మాత్రమే సరిపోదని, దానికి పటిష్టమైన సంస్థాగత నిర్మాణం, ఓటరు విశ్వాసం తోడవ్వాలని విజయ్ కి కమల్ సూచించారు. అయితే, తన సభలు కేవలం అభిమానుల సమావేశాలు మాత్రమేనని విమర్శించిన వారికి విజయ్ కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చారు. తిరువారూర్‌లో అభిమానులనుద్దేశించి మాట్లాడుతూ.. అధికార భాగస్వామ్య పక్షాలను ఈ సారి ప్రజలు ఇంటికి పంపించడం ఖాయమని విమర్శించారు. తమ అభిమానం ఓట్లుగా మారుతుందనే సంకేతాలు ఇచ్చారు. మరోవైపు 2026లో జరగబోయే ఎన్నికల్లో విజయ్ ప్రవేశం తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.