కమలాకర్ శర్మ ఆస్తులు అమ్మేసి.. మాకు న్యాయం చేయండి

కమలాకర్ శర్మ ఆస్తులు అమ్మేసి.. మాకు న్యాయం చేయండి
  • ఈ కేసులో సీసీఎస్ విచారణ నత్తనడకన నడుస్తున్నది
  • ప్రభుత్వానికి ధన్వంతరి బాధితుల ఫోరం విజ్ఞప్తి

బషీర్​బాగ్, వెలుగు: ధన్వంతరి ఫౌండేషన్ అధినేత కమలాకర్ శర్మ బినామీ, అక్రమ ఆస్తులను విక్రయించి, తమకు న్యాయం చేయాలని ధన్వంతరి బాధితుల ఫోరం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సోమవారం హైదర్​గూడలో జరిగిన ధన్వంతరి బాధితుల ఫోరం సమావేశంలో కన్వీనర్ గిరి ప్రసాద్ శర్మ మాట్లాడారు. కమలాకర్ శర్మ అధిక వడ్డీల పేరుతో 3 వేల మంది బ్రాహ్మణుల నుంచి ₹1,500 కోట్లు వసూలు చేసి మోసం చేశారన్నాన్నారు. 

పెట్టుబడిదారుల డబ్బులతో కొన్న ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. సీజ్​లో ఉన్న భూములను ప్రైవేట్ సర్వే చేయడం, ఆర్థిక లావాదేవీలకు పాల్పడడం, ఒరిజినల్ డాక్యుమెంట్లను ఇస్తామని డబ్బులు వసూలు చేయడం, బెయిల్ కండిషన్లను దుర్వినియోగం చేస్తూ, కోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తున్నారని తెలిపారు.  

బాధితుల్లో చాలామంది వృద్ధులు ఉన్నారని, కొందరు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సెటిల్మెంట్ పేరిట జరుగుతున్న భూ వ్యాపారాలు, ఒప్పందాలను వెంటనే ఆపాలన్నారు. కమలాకర్ శర్మ, లేడీ డైరెక్టర్స్ బెయిల్​ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో సీసీఎస్ విచారణ నత్తనడకన నడుస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని సీసీఎస్ కు అటానమస్ పవర్స్ ఇవ్వాలని కోరారు. అలాగే ఈ కేసుకు ప్రత్యేకంగా అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను నియమించాలన్నారు. ఈనెల 26న నాంపల్లి ఎంఎస్జే కోర్టు తీర్పును బట్టి  కమలాకర్ శర్మ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.