ప్రజలు, రైతులు అలర్ట్గా ఉండాలి : ఆశిష్ సంగ్వాన్

 ప్రజలు, రైతులు అలర్ట్గా ఉండాలి :  ఆశిష్ సంగ్వాన్
  • కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

నిజాంసాగర్ (ఎల్లారెడ్డి), వెలుగు: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో కొనసాగుతుందని, ప్రధాన కాలువ సరిహద్దుల గ్రామాల ప్రజలు, మంజీరా నది కాలువ సరిహద్దుల గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, సరిహద్దుల్లోకి వెళ్లకూడదని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. మంగళవారం ఆయన బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయితో కలిసి నిజాంసాగర్ ప్రాజెక్ట్ ను పరిశీలించారు. గేట్లు, ప్రాజెక్ట్ పరిస్థితిపై ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆరేడు గ్రామ శివారులోని 20 గేట్ల ద్వారా నీటి విడుదలను పరిశీలించారు. సుమారుగా 36 ఏండ్ల కింద ఈ వరద గేట్ల ద్వారా నీటిని వదిలి, మళ్లీ ఇప్పుడు ఈ గేట్ల నుంచి నీటిని కిందకి వదులుతున్నట్లు ఇరిగేషన్ అధికారులు కలెక్టర్ కు తెలిపారు. 

అనంతరం గోల్​ బంగ్లా వద్ద ప్రభుత్వం మంజూరు చేసిన రూ.10 కోట్లతో నిర్మించే క్యాటేజీ, హోటల్, గెస్ట్ హౌస్ తదితర నిర్మాణ పనులు, మ్యాపును పరిశీలించి, పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్​ మాట్లాడుతూ ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టుకు 85000 క్యూసెక్కుల నీరు వస్తుందని, అంతే మొత్తంలో మంజీరా నదిలోకి వదులుతున్నామని తెలిపారు. అన్ని గ్రామాల్లో దండోరా వేసి, జీపీ కార్యదర్శుల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. 

అనంతరం అచ్చంపేట వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని నర్సింగ్ రావుపల్లి ఎరువుల విక్రయాల గోదాంను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజినీర్ టి.శ్రీనివాస్, ఎస్ఈ రాజశేఖర్, ఈఈ సోలమన్, ఏఈఈ శివ, సాకేత్, అక్షయ్, తహసీల్దార్ భిక్షపతి, ఎంపీడీవో గంగాధర్, ఎస్సై శివకుమార్, మిషన్ భగీరథ ఏఈ సుమలత, జిల్లా వ్యవసాయశాఖ అధికారి మోహన్ రెడ్డి, మండల వ్యవసాయ శాఖ అధికారి అమర్ ప్రసాద్, అచ్చంపేట సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి పాల్గొన్నారు.