
- కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి, వెలుగు : యాసంగి వడ్లు చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. మంగళవారం బీబీపేట మండలంలోని తుజాల్పూర్లో కొనుగోలు సెంటర్‌ను, బీబీపేట మండల కేంద్రంలో ఫెస్టిసైడ్ షాపును పరిశీలించారు. మోడల్ ఇందిరమ్మ ఇంటితో పాటు, పీహెచ్‌సీని కలెక్టర్విజిట్ చేసి మాట్లాడారు. కొన్ని సెంటర్లలోనే ఇంకా వడ్లు మిగిలిఉన్నాయన్నారు. ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన విత్తనాలు, ఎరువులు మాత్రమే అమ్మాలని సూచించారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరగా ప్రారంభించుకోవాలన్నారు. హాజరు రిజిస్ర్టర్లో పలువురు సిబ్బంది సంతకాలు చేయకపోవడంతో మెడికల్ ఆఫీసర్‌ను ప్రశ్నించారు. అనధికార సెలవుల్లో ఉన్న సూపర్ వైజర్‌ను సస్పెండ్ చేయాలని కలెక్టర్ డీఎంహెచ్‌వో ను ఆదేశించారు. పోగ్రామ్ ఆఫీసర్లను నోటీసులు జారీ చేయాలన్నారు.
స్కూల్ యూనిఫాం రెడీగా ఉంచాలి
స్కూల్స్ ప్రారంభానికి ముందే విద్యార్థులకు యూనిఫాంలు రెడీగా ఉంచాలని కలెక్టర్ పేర్కొన్నారు. దోమకొండ మండల కేంద్రంలో యూనిఫాం కుట్టు కేంద్రాన్ని పరిశీలించి మహిళా సంఘాల ప్రతినిధులతో మాట్లాడారు. మొత్తం 77,081 మంది స్టూడెంట్స్‌కు యూనిఫాంలు పంపిణీ చేయాల్సి ఉందన్నారు.
మహిళా సంఘాలు జిల్లాలో వడ్ల కొనుగోలు ద్వారా 3.20 కోట్ల ఆదాయం పొందారన్నారు. ఇందిరా శక్తి క్యాంటిన్‌ను పరిశీలించారు. కలెక్టర్ వెంట డీఆర్డీవో సురేందర్, డీసీవో రాంమోహన్, డీఎంహెచ్‌వో డాక్టర్ చంద్రశేఖర్, హార్టికల్చర్ ఆఫీసర్ జ్యోతి, జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ తిరుమల ప్రసాద్, డీపీఎం రమేశ్, ఎంపీడీవో పూర్ణచందర్, తహసీల్దార్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
రాష్ర్ట ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు చేయాలి
కామారెడ్డి టౌన్, వెలుగు : జూన్ 2 తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు చేపట్టాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఆయా శాఖల జిల్లా అధికారులతో మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. వేడుకలను ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి చేయడంతోపాటు అమరవీరుల స్థూపం దగ్గర క్లీన్ చేయించాలన్నారు. చీఫ్గెస్ట్సందేశాన్ని రెడీ చేయాలని, అభివృద్ధి సంక్షేమ పథకాల శకటాల ప్రరద్శన, స్టాల్స్, కల్చరర్ పోగ్రామ్స్ నిర్వహించాలన్నారు.
లబ్ధిదారులకు సంక్షేమ పథకాల మంజూరు ఉత్తర్వులు అందించాలన్నారు. అడిషనల్ కలెక్టర్లు వి.విక్టర్, చందర్, ఆర్డీవో వీణ , అధికారులు ఉన్నారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ మీటింగ్‌లో మాట్లాడుతూ ఇంటింట సర్వే చేపట్టి టీబీ వ్యాధిగ్రస్తులను గుర్తించాలన్నారు. టెస్టులో వారికి టీబీ ఉన్నట్లు తేలితే మందుల కిట్, పోషకాహారం కోసం రూ. 500 ఇవ్వాలన్నారు. డీఎంహెచ్‌వో డాక్టర్ చంద్రశేఖర్ ఉన్నారు.