కామారెడ్డిలో అస్తవ్యస్థంగా డ్రైనేజీలు

కామారెడ్డిలో అస్తవ్యస్థంగా డ్రైనేజీలు

కామారెడ్డి , వెలుగు: కామారెడ్డి జిల్లాకు ఏటా వర్షాకాలం ముంపు ముప్పు తప్పడం లేదు. జిల్లా కేంద్రంగా మారినప్పటికీ అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. మెయిన్​రోడ్ల వెంట సరైన డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో జనం అవస్థలు పడుతున్నారు. వానాకాలం వచ్చిందంటే టౌన్‌‌లో పలు కాలనీల ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయందోళన చెందుతున్నారు. భారీ వర్షాలు కురిసినప్పుడు లోతట్టు ఏరియాలోని ప్రజలతో పాటు, మెయిన్ రోడ్ల వెంట వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

10 లోతట్టు ప్రాంతాలు..

టౌన్‌‌లో 10 వరకు లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా పాత టౌన్‌‌లోని అయ్యప్పనగర్​, వాసవీనగర్, గాంధీ నగర్, రామారెడ్డి రోడ్డు, బతుకమ్మ కుంట, టీచర్స్​కాలనీ, న్యూ టౌన్ వైపు శ్రీరాంనగర్​కాలనీ సమీపంలోని రుక్మిణికుంట, విద్యానగర్​కాలనీలోని కొన్ని ఏరియాల్లో వర్షాకాలంలో ప్రాబ్లమ్స్​ఏర్పడనున్నాయి. కొన్నాళ్ల  కింద బతుకమ్మకుంట ఏరియాలో  పెద్ద డ్రైనేజీ నిర్మాణం చేపట్టడంతో ఇక్కడ కొంత ముంపు ముప్పు తప్పింది. మిగతా ఏరియాలకు మాత్రం ఇంకా  సమస్య అలాగే ఉంది.  సిరిసిల్ల రోడ్డు, స్టేషన్​రోడ్డు, సుభాష్​రోడ్డు, నిజాంసాగర్ చౌరస్తా ఏరియా, నిజాంసాగర్ చౌరస్తా నుంచి  దేవునిపల్లి ఏరియా వైపు డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదు. స్టేషన్ రోడ్డులో దశబ్దాల కిం నిర్మించిన డ్రైనేజీ కంప్లీట్‌‌గా ముసుకుపోయింది.  చిన్న వర్షం పడినా నీరు రోడ్డుపైనే ప్రవహిస్తుంది. ఇక్కడ డ్రైనేజీ నిర్మాణంపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. సిరిసిల్లా రోడ్డులో డ్రైనేజీలో సరిగా లేక వర్షపు నీరంతా అయ్యప్పనగర్​కాలనీలోని రోడ్లపైన ప్రవహించి ఇండ్లలోకి వెళ్తుంది.  

ఇన్​ కంప్లీట్‌‌గా డ్రైనేజీ

మెయిన్​రోడ్ల వెంట డ్రైనేజీలు పలు చోట్ల ఇన్​కంప్లీట్‌‌గానే ఉన్నాయి. ఇందిరా చౌక్ నుంచి  ధర్మశాల వరకు రెండు వైపుల డ్రైనేజీ దశబ్దాల కింద నిర్మించారు. కొత్త బస్టాండ్‌‌ నుంచి ఆశోక్​కాలనీ రైల్వే గేట్ వరకు పెద్ద డ్రైనేజీ లేదు. కొత్త బస్టాంచ్‌‌ నుంచి  నిజాంసాగర్ చౌరస్తా నుంచి హౌజింగ్ బోర్డు కాలనీ వరకు చేపట్టిన పెద్ద డ్రైనేజీ మధ్యలో పనులు అగిపోయాయి. రైల్వే గేట్ నుంచి పంచముఖి హనుమాన్‌‌ టెంపుల్ వరకు డ్రైనేజీ లేదు. సిరిసిల్లా రోడ్డును డ్రైనేజీ నిర్మించిన తర్వాత వెడల్పు చేయాల్సి ఉండగా.. డ్రైనేజీ నిర్మాణం లేకుండానే  4 లైన్ల రోడ్డు వేశారు. కోట్లాది రూపాయలతో రోడ్ల నిర్మాణం చేపట్టిన డ్రైనేజీ వ్యవస్థ లేక జనం ఇబ్బంది పడుతున్నారు. మెయిన్​ రోడ్లతో పాటు ఆయా కాలనీ వైపు మెయిన్​ డ్రైనేజీల నిర్మాణం చేపట్టి ముంపు ముప్పు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.  

ఇండ్లలోకి నీళ్లు వస్తున్నయ్​

వానాకాలంలో  సిరిసిల్ల రోడ్డు నుంచి వచ్చే నీళ్లన్నీ మా కాలనీలోకి వస్తాయి. పెద్ద రోడ్డు వెంట మోరి సరిగ్గా లేదు. అందులో నీళ్లు పట్టక మా కాలనీకి వచ్చి ఇండ్లలోకి వస్తున్నాయి.  పెద్ద మోరి నిర్మిస్తే మాకు ప్రాబ్లమ్​పోతుంది.
- నర్సింహులు, అయ్యప్పనగర్ కాలనీ వాసి

చాలా ఇబ్బందిగా ఉంది

చిన్న వాన పడినా నీళ్లు రోడ్డుపైనే పారుతాయి. రోడ్డుకు రెండు దిక్కుల మోరీ లేదు.  వర్షం వచ్చిందంటే వెహికల్స్‌‌‌‌తో పాటు, నడ్చుకుంట పోయే వాళ్లు ఇబ్బంది పడుతుంటారు. మా షాపుల వాళ్లకు కూడా ప్రాబ్లమవుతోంది.
- శ్రీనివాస్, స్టేషన్ రోడ్డు వాసి