ఇందిరమ్మకు బ్రిడ్జి లోన్ .. ఇండ్ల నిర్మాణానికి మహిళా సంఘాల ద్వారా రూ. లక్ష రుణం

ఇందిరమ్మకు బ్రిడ్జి లోన్ .. ఇండ్ల నిర్మాణానికి మహిళా సంఘాల ద్వారా రూ. లక్ష రుణం
  • నిర్మాణాలు సాఫీగా సాగేలా చర్యలు
  • ​లోన్ ఇప్పించేందుకు జిల్లాయంత్రాంగం కసరత్తు  

కామారెడ్డి, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు సాఫీగా సాగేలా జిల్లాయంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. నిర్మాణ పనులు ప్రారంభంలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా లబ్ధిదారులకు  బ్రిడ్జి లోన్ ఇప్పించేందుకు కసరత్తు చేస్తోంది.  గ్రామ సమాఖ్య, స్ర్తీనిధి, బ్యాంక్​ లింకేజీ ద్వారా ఒక్కో లబ్ధిదారుడికి రూ. లక్ష లోన్ ఇప్పించనుంది. ఐకేపీ యంత్రాంగం ఈ లోన్​పై  లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తోంది.  మొదటి విడతగా మండలానికి ఒక గ్రామం చొప్పున 22 గ్రామాలకు 1,719 ఇండ్లు మంజూరయ్యాయి. ఇందులో 400 ఇండ్లకు అధికారులు మార్కవుట్ ఇవ్వగా,  కొన్ని ఇండ్ల నిర్మాణ పనులు షురూ అయ్యాయి.  మిగతా గ్రామాల్లోనూ అధికారులు సర్వే నిర్వహించారు. 

త్వరలో లబ్ధిదారుల ఫైనల్ జాబితాను పంచాయతీల నోటీస్ బోర్డులపై అంటించనున్నారు. జిల్లా ఇన్​చార్జి మంత్రి ఆమోద ముద్ర వేయగానే లబ్ధిదారులు నిర్మాణాలు ప్రారంభించుకోవచ్చు. ఆయా నిర్మాణ దశలకు అనుగుణంగా విడతల వారీగా రూ.5లక్షలను ప్రభుత్వం అందజేయనుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పనులు ప్రారంభించలేని లబ్ధిదారులకు లోన్ ఇప్పించి చేయూతనందించాలని ప్రభుత్వం ఆయా జిల్లాల అధికారులకు సూచించింది. ఇండ్లు మంజూరైన లబ్ధిదారులంతా దాదాపుగా మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. 

రూ. లక్ష వరకు లోన్.. 

బెస్మెంట్​లెవల్ వరకు కంప్లీట్ అయితే  ప్రభుత్వం రూ. లక్ష చెల్లిస్తుంది.  రూప్ లెవల్, స్లాబ్, ఇతర పనులు కంప్లీట్ కాగానే  పూర్తి అమౌంట్ చెల్లించనుంది. బెస్మెంట్​ మొదలు ఆయా దశల్లో పనులు నిలిచిపోకుండా లోన్​ ఇప్పించి  పునాదుల తవ్వకం, ఇసుక, సిమెంట్, సలాక వంటి మేటిరియల్, మేస్ర్తీ అమౌంట్ తదితర వాటికి లోన్​ డబ్బులను వినియోగించనున్నారు. ఆసక్తి ఉన్నవారికి మాత్రమే ఈ లోన్​ ఇప్పించి, ప్రభుత్వం అందించే పేమెంట్​ ప్రకారం లోన్​ చెల్లించవచ్చు. ఇండ్ల నిర్మాణ పనుల్లో అంతరాయం ఏర్పడకుండా చూడాలన్నదే సర్కార్​ ఉద్దేశం. ఇప్పటికే జిల్లాలో 60 ఇండ్లు బెస్మెంట్​ లెవల్​ వరకు నిర్మాణాలు పూర్తయ్యాయి.  

లబ్ధిదారులు ముందుకొస్తే లోన్..

ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు ముందుకొస్తేనే రూ.లక్ష లోన్​ ఇప్పిస్తాం. నిర్మాణ పనులు ఆగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే లబ్ధిదారులకు అవగాహన కల్పించాం.  

సురేందర్, డీఆర్డీవో