
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా కోలుకుంటోంది. వర్షాలు ఆగిపోయి వరదలు తగ్గుముఖం పట్టాయి. ఆయా శాఖల అధికారులు, సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయక చర్యలు వేగవంతం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిల వద్ద తాత్కాలిక రిపేర్లు చేయించడంలో
జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. లింగంపేట, ఎల్లారెడ్డి, నిజాంసాగర్, రాజంపేట, కామారెడ్డి, బీబీపేట మండలాల్లో జేసీబీలతో రోడ్లను క్లీన్ చేసి మట్టి, కంకర పోసి పునరుద్ధరిస్తున్నారు. కరెంట్ సరఫరా నిలిచిన ప్రాంతాల్లో తిరిగి పునరుద్ధరిస్తున్నారు. చెరువులకు పడిన బుంగలను పూడ్చుతున్నారు. దెబ్బతిన్న పంటల వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు
సేకరిస్తున్నారు.
వరద నష్టాల సేకరణ..
జిల్లా కేంద్రంలోని జీఆర్ కాలనీ, హౌజింగ్ బోర్డు కాలనీ, టీచర్స్ కాలనీ, బతుకమ్మ కుంట, అయ్యప్పనగర్ కాలనీలలో వరద నీరు చేరి నష్టం వాటిల్లింది. జీఆర్ కాలనీలోని ఇండ్లల్లో బురద పేరుకుపోయింది. బురద, చెత్త తొలగించే పనులు సాగుతున్నాయి. రెవెన్యూ, మున్సిపల్, రెస్క్యూ టీమ్స్, రోటరీ, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సమాజ సేవకులు ఇండ్లలో బురద తొలగిస్తున్నారు. ఆహారం, వాటర్ బాటిల్స్ అందజేశారు.
శనివారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అడిషనల్ కలెక్టర్ చంద్రనాయక్, ఆర్డీవో వీణ, మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌రెడ్డి, తహసీల్దార్ జనార్దన్ సహాయక చర్యలను పర్యవేక్షించారు. జీఆర్ కాలనీలో ప్రతి ఇంటిని కలెక్టర్ పరిశీలించారు. కరెంట్ పునరుద్ధరణకు ఎలక్ట్రిసిటీ యంత్రాంగం చర్యలు చేపట్టింది. బాధితులకు ఆర్థిక సాయం అందించేందుకు పేర్లు, ఆధార్, బ్యాంక్ అకౌంట్ల వివరాలు సేకరిస్తున్నారు.
తక్షణ సాయం
జీఆర్ కాలనీలో వరదలతో దెబ్బతిన్న 48 ఇండ్ల బాధితులు ఒక్కొక్కరికి రూ.11,500 తక్షణ సాయం అందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. నిత్యావసర వస్తువులు, దుప్పట్లు అందించనున్నట్లు పేర్కొన్నారు. సహాయక పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. తాగునీరు, కరెంట్, శానిటేషన్ పనులను పరిశీలించారు. కాలనీలో త్వరలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని తెలిపారు.