కామారెడ్డి, వెలుగు: వివాహేతర సంబంధానికి అడ్డు ఉన్నాడనే కారణంతో ప్రియురాలి కొడుకును ప్రియుడు హత్య చేశాడు. టౌన్ సీఐ నరహరి తెలిపిన ప్రకారం.. కామారెడ్డి జిల్లా రాజంపేటకు చెందిన లక్ష్మికి ఇదే మండలానికి చెందిన వ్యక్తితో పెళ్లి జరగగా, సమీరా(8), శ్రావణ్(5) పిల్లలు ఉన్నారు. గొడవలతో లక్ష్మి భర్తతో దూరంగా ఉంటోంది. కొన్ని నెలలుగా కామారెడ్డి పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీలో ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది. 6 నెలలుగా బీబీపేట మండలం మాందాపూర్కు చెందిన లక్ష్మీనర్సింలుతో సహజీవనం చేస్తోంది.
బిడ్డ సమీరాను తల్లి వద్ద ఉంచగా, కొడుకు లక్ష్మి వద్దే ఉంటున్నాడు. శుక్రవారం సాయంత్రం లక్ష్మీనర్సింలు ఇంటికి వచ్చి శ్రావణ్గొంతు పిసికి, నోరు, ముక్కు మూసి చంపేశాడు. పనికి వెళ్లి లక్ష్మి రాత్రికి ఇంటి వచ్చే సరికి బాలుడు అపాస్మారక స్థితిలో ఉన్నాడు. ఆ తరువాత ఇద్దరూ కలిసి హాస్పిటల్కు తీసుకెళ్లగా, బాలుడు అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. లక్ష్మి బంధువుల ఫిర్యాదు మేరకు లక్ష్మీనర్సింలుపై కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

