కామారెడ్డి జిల్లాలో సాగు సంబురం..ఇంకా కొనసాగుతున్న వరి నాట్లు 

కామారెడ్డి జిల్లాలో సాగు సంబురం..ఇంకా కొనసాగుతున్న వరి నాట్లు 

 

  • వర్షాలు కురుస్తుండడంతో జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం
  • ఈసారి జిల్లాలో సాగు అంచనా 5,21,448 ఎకరాలు 
  • ఇప్పటికే 4,55,579 ఎకరాల్లో సాగైన పంటలు 
  • వ్యవసాయ పనుల్లో బిజీగా గడుపుతున్న రైతులు

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో సాగు సంబురంగా సాగుతున్నది. 10 రోజుల కింద నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురియడంతో వరి నాట్లు జోరందుకున్నాయి.  వానకాలం ఆరంభంలో మక్క, పత్తి, సోయా, పప్పు దినుసుల పంటలు సాగయ్యాయి.  బోరుబావులు, చెరువులు, కాల్వల కింద వరి నాట్లు వేశారు. ఇప్పటి వరకు 87 శాతం పంటలు సాగు కాగా, పలు మండలాల్లో మరో 15 రోజుల పాటు వరి నాట్లు వేయనున్నారు.

అంచనాకు మించి వరి సాగు జరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. నిజాంసాగర్, మహమ్మద్​నగర్, నాగిరెడ్డిపేట, పాల్వంచ, బీబీపేట, దోమకొండ, మాచారెడ్డి, కామారెడ్డి మండలాల్లో పోచారం ప్రాజెక్ట్, బోర్లు, చెరువుల కింద ఇంకా నాట్లు వేస్తున్నారు.  మధ్యలో వర్షాలు లేక వరి నాట్లు అలస్యంగా వేస్తున్నారు. వానకాలం సీజన్​లో జిల్లావ్యాప్తంగా 5,21,448 ఎకరాల్లో పంటలు సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేయగా, ఇప్పటి వరకు  4,55,579 ఎకరాల్లో ఆయా పంటలు సాగయ్యాయి. 

కంది విస్తీర్ణం పెరిగింది .. 

జిల్లాలో కంది సాగు రెట్టింపు అయ్యింది.   సోయాలో అంతర్​ పంటగా కందిని వేశారు.  అంచనా కంటే కంది విస్తీర్ణం 29,200 ఎకరాలు పెరిగింది. మక్క విస్తీర్ణం 4501 ఎకరాలు, పత్తి  3,549 ఎకరాలు, సోయా 4,420 ఎకరాలు,  పెసర 1,737 ఎకరాలు, మినుము893 ఎకరాలు సాగయ్యాయి.

మరో 15 రోజులు వరినాట్లు

ముందుగా కురిసిన వర్షాలకు దాదాపుగా పంటలు సాగయ్యాయి. మధ్యలో డిలే అయినా ఇటీవల కురిసిన వర్షాలకు సాగు పనులు మళ్లీ జోరందుకున్నాయి. మరో 15 రోజులపాటు వరినాట్లు కొనసాగనున్నాయి. కురుస్తున్న వానలతో మక్క, పత్తి, సోయా వంటి పంటలకు మేలు జరగనుంది.  - మోహన్​రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి