హైవేపై కంటైనర్ లో దోపిడీ.. మధ్య ప్రదేశ్కు చెందిన ముఠా అరెస్ట్: కామారెడ్డి ఎస్పీ రాజేశ్ వెల్లడి

హైవేపై కంటైనర్ లో దోపిడీ.. మధ్య ప్రదేశ్కు చెందిన ముఠా అరెస్ట్: కామారెడ్డి ఎస్పీ రాజేశ్ వెల్లడి

కామారెడ్డి, వెలుగు:  కంటైనర్ ను వెంబడించి దోపిడీకి పాల్పడిన మధ్యప్రదేశ్​కు చెందిన ముఠాలోని ముగ్గురిని కామారెడ్డి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. కామారెడ్డి ఎస్పీ రాజేశ్​చంద్ర గురువారం మీడియాకు కేసు వివరాలు వెల్లడించారు. గత నెల11న నేషనల్ హైవేపై నిజామాబాద్​వైపు కంటైనర్​వెళ్తుండగా.. దోపిడీ దొంగలు బైక్ పై వెంబడించారు. కామారెడ్డి జిల్లా దేవునిపల్లి పోలీస్​స్టేషన్​పరిధి టెకిర్యాల్​శివారులో ఆపారు. అనంతరం కంటైనర్ సీల్​ను కట్టర్​తో కట్ చేసి లోపలకు వెళ్లి సెల్​ఫోన్లు, హెడ్​సెట్స్​ను ఎత్తుకెళ్లారు.  ఫిర్యాదు మేరకు ఏఎస్పీ చైతన్యరెడ్డి ఆధ్వర్యంలో 2 స్పెషల్​టీమ్స్​దర్యాప్తు చేపట్టాయి. 

దోపిడీకి పాల్పడిన ఐదుగురు సభ్యుల్లో ముగ్గురిని అరెస్టు చేశాయి. మధ్యప్రదేశ్​కు చెందిన ప్రదీప్​ హుడా, విమల్​సిసోడియా, రితిక్​ఝాంజ, మాల్వియా, దేవిసింగ్​సిసోడియాను నిందితులుగా గుర్తించారు. వీరిలో రితిక్​ఝాంజ,  మాల్వియా దీపక్​కుమార్​, దేవిసింగ్​ సిసోడియాను అరెస్ట్ చేయగా.. మిగతా ఇద్దరు పరారీలో ఉన్నారు. 

పట్టుబడిన నిందితుల నుంచి పల్సర్​ బైక్, కత్తి,  3 సెల్​ఫోన్లు, కట్టర్​స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ నిందితులు రన్నింగ్​ లారీలను టార్గెట్ గా చేసుకుని పలు దోపిడీలకు పాల్పడి జైలుకు వెళ్లివచ్చారు. కేసు దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించిన ఏఎస్పీ, సీఐ రామన్, ఎస్ఐ రంజిత్​, అనిల్,  సిబ్బందిని ఎస్పీ అభినందించారు.