హమ్మయ్య.. కామారెడ్డి వాసికి మంకీపాక్స్ నెగటివ్

హమ్మయ్య.. కామారెడ్డి వాసికి మంకీపాక్స్ నెగటివ్

తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి వాసికి మంకీపాక్స్ నెగటివ్ అని తేలింది. అతడి నుంచి సేకరించిన నమూనాలను పూణె వైరాలజీ ల్యాబ్ కు పంపిన సంగతి  తెలిసిందే. పూణె ల్యాబ్ లో  టెస్టులు చేయగా మంకీపాక్స్ నెగటివ్ వచ్చింది. చికెన్ పాక్స్ అయ్యి ఉండే అవకాశాలున్నాయని అనుమానిస్తున్నారు. బాధితుడు కోలుకుంటున్నట్లు ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ శంకర్ వెల్లడించారు.  V6 అతనితో మాట్లాడగా.. చికెన్ పాక్స్ అయ్యి ఉండొచ్చన్నారు. ఇతను వేరే కంట్రీ నుంచి రావడంతో తాము వైద్య పరీక్షలు చేసినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులకు మాత్రం ఎలాంటి లక్షణాలు లేవన్నారు. మంకీపాక్స్, చికెన్ పాక్స్ లకు సేమ్ టు సేమ్ లక్షణాలు ఉంటాయన్నారు. చికెన్ పాక్స్ సోకితే.. త్వరగానే కొలుకుంటారన్నారు. 

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన 35 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు ఉన్నాయనే విషయం కలకలం రేపింది. ఇటీవలే ఇతను కువైట్ నుంచి వచ్చాడు. శరీరంపై దద్దుర్లు రావడంతో ఆసుపత్రికి వచ్చాడు. అక్కడున్న వైద్యులు మంకీపాక్స్ లక్షణాలుగా గుర్తించారు. వెంటనే జిల్లా యంత్రాంగానికి సమాచారం అందించారు. బాధితుడిని హైదరాబాద్ ఫీవర్ ఆసుపత్రికి పంపించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అతడిని నుంచి నమూనాలు సేకరించి పూణెకు పంపించారు. రిపోర్ట్ లో నెగటివ్ రావడంతో అందరూ ఊపిరీపీల్చుకున్నారు. మంకీపాక్స్‌ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇక భారత్‌లోనూ మంకీపాక్స్‌ కేసులు కలవరపెడుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, కేరళలో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి.  ఒకదేశం నుంచి మరో దేశానికి పాకుతోన్న ఈ వైరస్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించింది.