
కామారెడ్డి, వెలుగు : పెండింగ్ కేసులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ రాజేశ్చంద్ర సూచించారు. శుక్రవారం జిల్లా పోలీసు ఆఫీసులో జరిగిన క్రైమ్ రివ్యూ మీటింగ్‌లో ఎస్పీ మాట్లాడారు. పాత, కొత్త కేసులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, టెక్నాలజీని వినియోగించి ఎంక్వైరీ వేగవంతం చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్ల గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ప్రతిరోజూ నిర్వహించాలని సూచించారు.
గంజాయి, మత్తు పదార్థాలు, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, సైబర్ నేరాల నివారణపై దృష్టి పెట్టాలన్నారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసి డీజేలకు అనుమతి ఇవ్వబోమన్నారు. ఏఎస్పీ చైతన్యారెడ్డి, డీఎస్పీలు శ్రీనివాస్‌రావు, విఠల్‌రెడ్డి, ఎస్‌బీ సీఐ శ్రీధర్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
నిబద్ధత, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి
పోలీసు సిబ్బంది నిబద్ధత, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని ఎస్పీ సూచించారు. శుక్రవారం జిల్లా పోలీసు గ్రౌండ్‌లో ఆర్మీ రిజర్వు సిబ్బంది, హోంగార్డులతో మీటింగ్ నిర్వహించిన ఎస్పీ, ఇటీవల వరద సమయంలో ప్రతి సిబ్బంది కృషిని సీఎం స్వయంగా అభినందించారని గుర్తుచేశారు. విధుల్లో ప్రతిభ కనబరిచిన వారికి రివార్డులు, తప్పులు చేసినవారిపై శాఖ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అవసరమైనప్పుడు సెలవులు తీసుకోవాలని, ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తెలియజేయాలని సూచించారు. ఈ సందర్భంగా హోంగార్డులకు రెయిన్‌కోట్స్, ఉల్లెన్ జెర్సీలు అందజేశారు. ఏఎస్పీ చైతన్యారెడ్డి, డీఎస్పీలు, అధికారులు పాల్గొన్నారు.