ప్రాజెక్టులకు జలకళ అలుగు పారుతున్న చెరువులు యాసంగికీ డోకాలేదంటున్న రైతులు

ప్రాజెక్టులకు జలకళ  అలుగు పారుతున్న చెరువులు యాసంగికీ డోకాలేదంటున్న రైతులు

కామారెడ్డి, వెలుగు: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు నిండుకుండలా మారాయి. జిల్లాలోని 414 చెరువులు అలుగుపారుతున్నాయి. 15 రోజుల కిందటివరకు జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువుల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో నీటి నిల్వలు లేవు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో జలాశయాల్లోకి భారీగా నీళ్లు చేరాయి. ఎగువన ఉన్న సింగూర్​, పోచారం ప్రాజెక్టుల నుంచి నిజాంసాగర్​ ప్రాజెక్టులోకి 3 రోజులుగా భారీగా వరద వస్తోంది. నిజాంసాగర్​లో దాదాపు పూర్తిస్థాయిలో నీరు చేరింది.

 నిజాంసాగర్ ఫుల్​ కెపాసిటీ 17.8 టీఎంసీలుకాగా ప్రస్తుతం 15.943 టీఎంసీల నీరు ఉంది. మంగళవారం సాయంత్రం వరకు ఇన్​ఫ్లో 80వేల క్యూసెక్కుల ఇన్​ ఫ్లో వస్తోంది. మంగళవారం 16 గేట్లు ఎత్తి 85 వేల క్యూసెక్కుల నీటిని మంజీరానదిలోకి వదులుతున్నారు. కౌలాస్​ నాలా ప్రాజెక్టు కెపాసిటీ 1.237 టీఎంసీలకు గాను ప్రస్తుతం 1.164 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 5 గేట్లు ఎత్తి వరద నీటిని బయటకు వదిలారు. కళ్యాణి ప్రాజెక్ట్​లో పూర్తి నీటిమట్టం 409 మీటర్లు కాగా 408 మీటర్ల వరకు నీరుంది. సింగీతం రిజర్వాయర్​ పూర్తిగా నిండింది. దీని పూర్తి మట్టం 416 మీటర్లు కాగా 416 మీటర్ల వరకు నీరు నిల్వ ఉంది. పోచారం, కళ్యాణి, కౌలాస్​, సింగీతం రిజర్వాయర్​లు నిండాయి. వానకాలం, యాసంగి పంటలకు సాగునీరు పూర్తిస్థాయిలో అందనుంది. 

 సగం చెరువులు ఫుల్​ 

జిల్లాలో మొత్తం 1,515 చెరువులు ఉండగా మంగళవారం వరకు దాదాపు సగం చెరువులు నిండాయి. 173 చెరువుల్లో 25 శాతం వరకు నీరుండగా, 262 చెరువులు 25 నుంచి 50 శాతం వరకు వరకు నిండాయి. 356 చెరువుల్లో 50 నుంచి 70 శాతం వరకు, 260 చెరువుల్లో 75 నుంచి 100 శాతం వరకు నీళ్లు ఉన్నాయని ఇరిగేషన్​ ఆఫీసర్లు చెప్తున్నారు. 414 చెరువులు అలుగుపారుతున్నాయి.