
- నత్తనడకన వడ్ల కాంటాలు
- సెంటర్లలో రైతుల పడిగాపులు
కామారెడ్డి, వెలుగు : జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కాంటాలు నత్తనడకన సాగుతున్నాయి. పలు సెంటర్లలో వారం నుంచి 15 రోజుల వరకు రైతులు పడిగాపులు కాయాల్సి వస్తోంది. వరుసగా కురుస్తున్న అకాల వర్షాలు రైతులను మరింత కుంగదీస్తున్నాయి. సెంటర్లలో వడ్లు ఎండకు ఎండుతూ వానకు తడువడంతో పాటు, ఎండిన వడ్లు కాంటా కాక దిగులు చెందుతున్నారు. తడిసిన వడ్లను మళ్లీ ఆరబోయటం, మళ్లీ వాన కురిసి తడవడం పరిపాటిగా మారింది. ముఖ్యంగా కామారెడ్డి, ఎల్లారెడ్డి డివిజన్లలో కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయి. జిల్లాలో 446 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 35, 161 మంది రైతుల నుంచి రూ. 597 కోట్ల విలువైన 2,57,449 టన్నుల వడ్లు కొనుగోలు చేశారు.
దొడ్డు రకం 1,07,343 టన్నులు, సన్నరకం 1,50,106 టన్నుల వడ్లు కొన్నారు. సన్నరకం వడ్లకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్ చొప్పున ఇప్పటి వరకు 9,410 మంది రైతులకు రూ. 43 కోట్ల 17 లక్షలు చెల్లించారు. కాంటాలు పెట్టకపోవడంతో పలు సెంటర్లలో రైతులు పడిగాపులు కాయాల్సి వస్తోంది. కామారెడ్డి, భిక్కనూరు, దోమకొండ, మాచారెడ్డి, పాల్వంచ, బీబీపేట తదితర ఏరియాల్లోని సెంటర్లలో వడ్ల కుప్పలు ఉన్నాయి. హమాలీల కొరత, వెహికల్స్ సకాలంలో రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తేమ శాతం వచ్చిన తర్వాత వడ్లు తడిసిపోతుండటంతో మళ్లీ ఆరబోస్తున్నారు. అధికారులు చొరవ చూపి కొనుగోళ్లు త్వరగా కంప్లీట్ అయ్యేలా చూడాలని రైతులు కోరుతున్నారు.
కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి సెంటర్లలో రైతులు 15 రోజులకు పైగా పడిగాపులు కాస్తున్నారు. కాంటలు సకాలంలో కావట్లేదు. అకాల వర్షాలతో వడ్ల కుప్పలు తడుస్తున్నాయని, మళ్లీ ఆరబోయడానికి రోజుల తరబడి ఆగాల్సి వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
కామారెడ్డి మండలం లింగాయపల్లి, కొటాల్పల్లిల్లో వడ్ల కొనుగోలు సెంటర్లో కొనుగోళ్లలో డిలే అవుతోంది. ఇక్కడ ఉన్నదే 12 మంది హమాలీలు.. లేటుగా వస్తున్నారు. లింగాయపల్లి, కొటాల్పల్లి సెంటర్లకు సంబంధించిన వడ్లను కాంటా పెట్టడం, లోడింగ్ చేయటం వీరే చేయాలి. హమాలీలు సరిపోక కాంటాలు డిలే అవుతున్నాయని రైతులు వాపోతున్నారు.