మోడీ ప్రభుత్వంలో అన్నీ సక్రమంగానే జరుగుతున్నాయి : కంగనా

మోడీ ప్రభుత్వంలో అన్నీ సక్రమంగానే జరుగుతున్నాయి : కంగనా

మైనార్టీలు, దళితులపై జరుగుతున్న మూకదాడులపై ప్రధాని మోడీ చర్యలు చేపట్టాలని కోరుతూ.. 49 మంది ప్రముఖులు జూలై 23న బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే ఈ లేఖకు కౌంటర్‌ గా అన్నట్టు వివిధ రంగాలకు చెందిన 61 మంది ప్రముఖులు మరో బహిరంగ లేఖ రాశారు. కొంతమంది ప్రధానికి లేఖ రాయడంపట్ల తాము ఆశ్చర్యానికి గురయ్యామని లేఖలో తెలిపారు. నక్సల్స్‌ దాడిలో అమాయక గిరిజనులు ప్రాణాలు కోల్పోయినప్పుడు, కశ్మీర్‌లో తీవ్రవాదులు స్కూళ్లను తగలబెట్టినప్పుడు, దేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తామని నినాదాలు చేసినప్పుడు వీళ్లెందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఈ లేఖలో సంతకాలు చేసిన వారిలో ప్రముఖ నటి కంగనా రనౌత్, గీత రచయిత ప్రసూన్ జోషి, శాస్త్రీయ నృత్యకళాకారిణి, ఎంపీ సోనల్ మనసింగ్, సినీ దర్శకుడు మధుర్ భండార్కర్ తదితరులు ఉన్నారు.

కంగనా రనౌత్ మాట్లాడుతూ.. ప్రజలను కొంతమంది ప్రముఖులు తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. మోడీ ప్రభుత్వంలో అన్నీ సక్రమంగా జరుగుతున్నాయని తెలిపారు. ‘‘భారీ మార్పులో మనం భాగస్వాములం. అభివృద్ధి దిశగా మార్పులు చోటుచేసుకంటుంటే.. కొంతమంది ఆందోళనకు గురవుతున్నారు. ప్రజలు తమ నేతలను ఎంపిక చేసుకున్నారు. ప్రజాతీర్పును గౌరవించలేని వాళ్లు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడగలరా’’ అని కంగనా ప్రశ్నించింది. జూలై 23నాటి లేఖలో సంతకాలు చేసిన వారిలో సినీ దిగ్గజాలు ఆదుర్ గోపాలకృష్ణన్, మణిరత్నం, అపర్ణాసేన్, చరిత్రకారుడు రామచంద్ర గుహతో మరికొంతమంది ప్రముఖలు ఉన్నారు. జైశ్రీరామ్ అన్నది యుద్ధ నినాదంగా మారిపోయిందని, మతం పేరుతో దాడులు జరగడం.. శాంతికాముక భారత పౌరులుగా గర్వించే తాము ఆందోళన చెందుతున్నట్టు లేఖలో తెలిపారు.