
తన తండ్రి చనిపోయాక తాను తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని మాజీ ఎంపీ, కన్నడ నటి దివ్య స్పందన(రమ్య) అన్నారు. ఆ సమయంలో రాహుల్ గాంధీ తనకు ఎంతో మద్దతిచ్చారని చెప్పారు. కన్నడ టాక్ షో లో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు.
తన తండ్రి చనిపోయిన రెండు వారాల తర్వాత పార్లమెంటుకు వెళ్లానని..అపుడు తనకు ఎవరు, ఏమీ తెలియదని చెప్పారు. ఆ తర్వాత ప్రతిదీ నేర్చుకున్నానని తెలిపారు. తన బాధను పని వైపు మళ్ళించానని.. మాండ్యా ప్రజలు తనకు నమ్మకాన్ని ఇచ్చారని ఆమె అన్నారు.
తన తండ్రి చనిపోవడం,ఎన్నికల్లో ఓడిపోవడంతో తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని దివ్య స్పందన చెప్పారు.ఆ సమయంలో రాహుల్ గాంధీ తనకు అండగా నిలిచారని తెలిపారు. ఎంతో ధైర్యం చెప్పారని గుర్తు చేశారు.తన జీవితంలో తన తల్లి అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తని.. ఆ తరువాత తన తండ్రి.. మూడో వ్యక్తి రాహుల్ గాంధీ అని ఆమె చెప్పారు.
దివ్య స్పందన 2012లో యువజన కాంగ్రెస్‌లో చేరారు. ఆమె 2013 ఉప ఎన్నికల్లో కర్ణాటకలోని మాండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. తర్వాత కాంగ్రెస్ సోషల్ మీడియా హెడ్‌గా పనిచేసిన ఆమె ఆ తర్వాత ఆ పదవికి రాజీనామా చేశారు. గతేడాది సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన దివ్య స్పందన సొంత ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించారు.