మలేసియా నుంచి వచ్చి కేరళలో కన్నుమూత

మలేసియా నుంచి వచ్చి కేరళలో కన్నుమూత

కోవిడ్​(కరోనా వైరస్​ డిసీజ్​)తో చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటిదాకా చైనాలో ఎక్కువ మంది చనిపోతుండగా, ఇప్పుడు వేరే దేశాల్లోనూ మరణాలు నమోదవుతున్నాయి. మన దేశంలోనూ తొలి కొవిడ్​ మరణం నమోదైనట్టు తెలుస్తోంది. కేరళకు చెందిన 36 ఏళ్ల వ్యక్తి ఆ మహమ్మారికి బలైపోయాడని సమాచారం. పయన్నూర్​కు చెందిన అతడు కొవిడ్​ లక్షణాలతో శుక్రవారం రాత్రి ఎర్నాకులంలోని గవర్నమెంట్​ మెడికల్​ కాలేజీలో చేరాడని అధికారులు చెబుతున్నారు. ఆ రోజు రాత్రే అతడి బ్లడ్​ శాంపిళ్లను అలప్పుజలోని నేషనల్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ వైరాలజీ (ఎన్​ఐవీ)లో టెస్ట్​ చేయగా నెగెటివ్​ వచ్చిందని అంటున్నారు. అయితే, టెస్టులు చేసిన కొద్ది సేపటికే శుక్రవారం అర్ధరాత్రి (12.30 గంటలకు– శనివారం) చనిపోయాడని తెలుస్తోంది. అతడు చనిపోయింది కొవిడ్​తోనేనా కాదా అని నిర్ధారించుకునేందుకు మరోసారి అతడి శాంపిళ్లను టెస్టుకు పంపుతున్నట్టు అధికారులు చెప్పారు. పుణేలోని ఎన్​ఐవీకి ఆ శాంపిళ్లను పంపామని, రిపోర్టులొచ్చాక కొవిడో కాదో తేలుస్తామని తెలిపారు.

రెండున్నరేళ్లుగా మలేసియాలో

చనిపోయిన వ్యక్తి రెండున్నరేళ్లుగా మలేసియాలోని సూపర్​మార్కెట్​లో పనిచేస్తున్నాడని అధికారులు చెప్పారు. గురువారం రాత్రి కొచ్చికి వచ్చాడని,  దగ్గు, జ్వరం వంటి లక్షణాలుండడంతో అర్ధరాత్రి దాటాక (శుక్రవారం) ఒంటి గంట టైంలో ఆస్పత్రి ఐసోలేషన్​ వార్డులో పెట్టామన్నారు. వెంటిలేషన్​తో ట్రీట్​మెంట్​ చేశామన్నారు. అంతేగాకుండా టెస్టుల్లో అతడికి ఇంతకుముందు న్యుమోనియా ఉండేదని తేలింది. దాంతో పాటు షుగర్​తోనూ బాధపడుతున్నట్టు డాక్టర్లు నిర్ధారించారు. అతడి మరణానికి కారణం న్యుమోనియా, శ్వాసకోశ వ్యవస్థ ఫెయిలవడమేనని డాక్టర్లు నిర్ధారించారు. పుణే ఎన్​ఐవీ నుంచి టెస్ట్​ రిపోర్టులు వస్తే గానీ అతడి మరణానికి అసలు కారణమేంటన్నది తెలుస్తుందని చెబుతున్నారు.

అమెరికాలోనూ ఫస్ట్​ డెత్​

అమెరికాలోనూ తొలి కొవిడ్​ మరణం నమోదైంది. ఇంతకుముందే ఓ అమెరికన్​ చనిపోయినా, అతడు చనిపోయింది వుహాన్​లో. తాజాగా అమెరికా గడ్డపైనే తొలి మరణం నమోదైంది. వాషింగ్టన్​ స్టేట్​లోని కింగ్​ కౌంటీకి చెందిన ఓ మహిళ దానికి బలైందని అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలోనే ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​, ఇంటర్నేషనల్​ ట్రావెల్​పై ఆంక్షలు విధించారు. చైనా, ఇరాన్​, దక్షిణ కొరియా, ఇటలీ నుంచి వచ్చే వాళ్లపై నిషేధం విధించారు. ‘‘దురదృష్టవశాత్తూ 50 ఏళ్ల ఓ మహిళ చనిపోయింది. దేశంలో మరిన్ని కొవిడ్​ కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే, ఆరోగ్యవంతులు ఆ వైరస్​ నుంచి త్వరగా కోలుకుంటారు. ప్రస్తుతం ఈ ఒక్క మరణంతో కంగారు పడాల్సిన పనిలేదు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని వైట్​హౌస్​లో ట్రంప్​ ప్రకటించారు. ఇరాన్​, దక్షిణ కొరియా, ఇటలీ వంటి దేశాలకు వెళ్లొద్దని అమెరికన్లకు సూచించారు. కొవిడ్​ను అడ్డుకునే పనిలో భాగంగా పాకిస్తాన్​ సోమవారం నుంచి వారం రోజుల పాటు ఆఫ్గనిస్థాన్​తో సరిహద్దులను మూసేయనుంది. ఈ మేరకు ఆ దేశ ఇంటీరియర్​ మినిస్ట్రీ ప్రకటించింది.

చికెన్​ వంటలు 30 రూపాయలే

కొవిడ్​ భయాల నేపథ్యంలో కోళ్లు, గుడ్లకూ ఆ వైరస్​ సోకుతోందని, దాన్ని తింటే ప్రమాదమని పుకార్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉత్తర్​ప్రదేశ్​లోని గోరఖ్​పూర్​లో చికెన్​ మేళాను ఏర్పాటు చేశారు. పౌల్ట్రీ ఫాం అసోసియేషన్​ ఆధ్వర్యంలో చికెన్​తో రకరకాల వంటకాలను తయారు చేసి జనానికి అందిస్తున్నారు. ఏ వంటకమైనా రూ.30కే ఇస్తున్నారు. చికెన్​, మటన్​, చేపలు తిన్నంత మాత్రాన కొవిడ్​ రాదని చెప్పేందుకే ఈ ప్రయత్నమని అసోసియేషన్​ ప్రెసిడెంట్​ వినీత్​ సింగ్​ తెలిపారు. మేళాలో భాగంగా వెయ్యి కిలోల చికెన్​తో వంటలు తయారు చేశామని, అవన్నీ ఖాళీ అయ్యాయని చెప్పారు.

ఇరాన్​లో పెరుగుతున్న మరణాలు

ఇరాన్​లో కొవిడ్​ మరణాలు పెరుగుతున్నాయి. ఆదివారం నాటికి కొవిడ్​తో చనిపోయిన వారి సంఖ్య 54కు పెరిగింది. 987 మంది వైరస్​ బారిన పడ్డారు. వైరస్​కు కేంద్ర బిందువైన చైనాలో మరణాలు తగ్గుముఖం పడుతున్నా, వేరే దేశాల్లో మరణాలు నమోదవుతుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. చైనాలో శనివారం 35 మంది చనిపోగా, మొత్తం చనిపోయిన వారి సంఖ్య 2,870కి పెరిగింది. కేసులు 79,824కు చేరాయి. ప్రపంచవ్యాప్తంగా 61 దేశాలకు వైరస్​ వ్యాపించగా, 86 వేల మందికి సోకింది. ఖతార్, ఈక్వెడార్​, ఐర్లాండ్​లలో ఫస్ట్​ కేసులు నమోదయ్యాయి.

కొరియాలో కాల్చేశారు

కొవిడ్​తో బాధపడుతున్న వారిని రక్షించుకునేందుకు వివిధ దేశాలు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ, కర్కశత్వానికి మారుపేరుగా పిలుచుకునే ఉత్తర కొరియా డిక్టేటర్​ కిమ్​ జోంగ్​ ఉన్​, కొవిడ్​ పేషెంట్​ను జాలి, దయ లేకుండా కాల్చి చంపించినట్టు తెలుస్తోంది. చైనా అఫైర్స్​ అనలిస్టుగా చెబుతున్న ఓ వ్యక్తి ‘సీక్రెట్​ బీజింగ్​’ అనే ట్విట్టర్​ అకౌంట్​లో ఆ విషయాన్ని వెల్లడించారు. ‘‘కొవిడ్​ వ్యాప్తిని అడ్డుకునే పనిలో భాగంగా కొరియాలో తొలి కొవిడ్​ పేషెంట్​ను కాల్చి చంపేసేందుకు కిమ్​ జోంగ్​ఉన్​ ఆర్డర్​ వేశారు’’ అంటూ అందులో పేర్కొన్నాడు. అయితే, ఆ పేషెంట్​ వివరాలను మాత్రం వెల్లడించలేదు. కాగా, అంతకుముందు ఫిబ్రవరి 13న ఓ ట్రేడ్​ అఫీషియల్​నూ కాల్చి చంపించినట్టు చెబుతున్నారు. మెట్రోయూకే కథనం ప్రకారం, 14 రోజుల పాటు క్వారెంటైన్​లో ఉండాల్సిన ఓ ట్రేడ్​ అఫీషియల్​ పబ్లిక్​లోకి వెళ్లడంతో కిమ్​కు కోపమొచ్చిందట. దీంతో వెంటనే కాల్చి చంపేయండంటూ ఆర్డర్స్​ పాస్​ చేశారట. అంతేగాకుండా, క్వారెంటైన్​ నుంచి బయటకు వచ్చే ఎవరికైనా ఇదే గతి పడుతుందంటూ హెచ్చరించారట.  కొద్ది రోజుల క్రితం చైనా నుంచి వచ్చిన ఆ అధికారిని క్వారెంటైన్​లో పెట్టారట. కానీ, అతడు అవేవీ లెక్క చేయకుండా జనాల్లోకి వెళ్లిపోయాడట. మరోవైపు తమ దేశంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని డబ్ల్యూహెచ్​వోకు కొరియా చెప్పింది.