
హిందూ వివాహ చట్టం ప్రకారం వివాహానికి కన్యాదానం అవసరం లేదని, ఏడడగులు (సప్తపది .. వధూవరులు ఏడుసార్లు అగ్ని ప్రదక్షిణ చేయడం ) మాత్రమే ముఖ్యమైన వేడుక అని అలహాబాద్ హైకోర్టు అభిప్రాయపడింది. అశుతోష్ యాదవ్ అనే వ్యక్తి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను విచారిస్తున్నప్పుడు జస్టిస్ సుభాష్ విద్యార్థితో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
తన అత్తమామలు దాఖలు చేసిన క్రిమినల్ కేసుపై లక్నో అదనపు సెషన్స్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ అశుతోష్ యాదవ్ హైకోర్టుకు వెళ్లారు. తన పెళ్లి సమయంలో కన్యాదానం జరగలేదు కాబట్టి ఈ వివాహం చెల్లదని వాదించారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా..హిందూ వివాహ చట్టం ప్రకారం కన్యాదానం చేయడం తప్పనిసరి కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం సప్తపది మాత్రం తప్పనిసరి అని కోర్టు తెలిపింది.
హిందూ సంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లిళ్లలో వధువు తల్లిదండ్రులు వరుడి కాళ్ల కడిగి కన్యాదానం చేస్తారు. ఆ సమయంలో వరుడు విష్ణువు అవతారంగా .. వధువు లక్ష్మీ దేవిని భావిస్తారు. కన్యాదానం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం వస్తుందని కూడా పెద్దలు చెబుతారు. అందుకే పెళ్లి కూతురు తల్లులు లేదా కన్యాదానం చేసేవారు వివాహం పూర్తయ్యే వరకు ఆహారం తీసుకోరు.