కన్యా దానం: దానమిచ్చేందుకు నేనేమైనా వస్తువునా?

కన్యా దానం: దానమిచ్చేందుకు నేనేమైనా వస్తువునా?

పెండ్లంటే ఇంటి నిండా చుట్టాలు. వారం ముందు నుంచే ఇల్లంతా సందడి. మెహందీ, సంగీత్‌‌, హల్దీ రకరకాల వేడుకలు. కానీ, పెండ్లి కూతురు మనసులో మాత్రం ‘పుట్టింటికి దూరంగా వెళ్లిపోవాలా? కొత్త జీవితం ఎలా ఉంటుందో? నేనే ఎందుకు వెళ్లాలి? ఇక ఈ ఇంటికి నేను పరాయి దాన్నా” అనే ఆలోచనలు తిరుగుతుంటాయి. మనసు మెలిపెట్టే బాధ ఉన్నా పైకిమాత్రం నవ్వుతూ కనిపిస్తుంది. 

పెండ్లి మొత్తం ఎంత సరదాగా సాగినా.. కన్యాదానం, అప్పగింతలప్పుడు పట్టరాని బాధ కలుగుతుంది అమ్మాయికి. పుట్టింటి వాళ్లు తనని దానం చేస్తున్నారని ఫీలవుతుంది. ఆ ఎమోషన్స్‌‌నే యాడ్‌‌గా చేసింది మాన్యవర్‌‌. ‘కన్యాదానమే ఎందుకు?‌‌ కన్యామాన్‌‌’ అనొచ్చు కదా అనే మెసేజ్‌‌ ఇస్తూ టీవీ కమర్షియల్‌‌ యాడ్‌‌ ఒకటి తీశారు. వెడ్డింగ్‌‌ సీజన్‌‌ మొదలు కాబోతున్న సందర్భంలో మోహే పేరుతో బ్రైడల్‌‌ లెహంగాలను ప్రమోట్‌‌ చేయడంకోసం బాలీవుడ్‌‌ బ్యూటీ అలియా భట్‌‌తో ఈ  కమర్షియల్‌‌ యాడ్‌‌ తీసింది. అది ఇప్పుడు చాలామంది అమ్మాయిల మనసు దోచుకుంటోంది. ట్రెండింగ్‌‌లో ఉంది. ఒకప్పుడు యాడ్స్‌‌లో ఆడవాళ్లను బట్టలు ఉతికే, అంట్లు తోమే ప్రొడక్ట్​లో మాత్రమే చూపించేవాళ్లు. కానీ, ఇప్పుడు అది మారింది. విమెన్‌‌ను ఇండిపెండెంట్‌‌గా చూపిస్తున్నారు. ఆ కేటగిరీలో చేసిందే మాన్యావర్​ తీసిన ఈ కమర్షియల్.  ‘కన్యాదానం’ అనేది మన సంప్రదాయం. దాన్నెలా మారుస్తారు? అని ఈ యాడ్‌‌పై కామెంట్లు పెడుతున్నారు కొందరు.  
యాడ్‌‌లో ఏముందంటే?
గ్రాండ్‌‌ పింక్‌‌ లెహంగా వేసుకుని, జువెలరీ పెట్టుకుని అలియాభట్‌‌ పెళ్లి పీటల మీద కూర్చుని.... ‘‘ దాదీ నా చిన్నప్పట్నించీ ఒక మాట అంటుండేది  నువ్వు పెళ్లి చేసుకుని వేరే ఇంటికి వెళ్లిపోయాక నిన్ను నేను బాగా గుర్తుచేసుకుంటానని. అంటే.. ఈ ఇల్లు నాది కాదా?” అనుకుంటుంది. ఈ సీన్​ తర్వాత నాన్న వచ్చి సెల్ఫీ తీసుకుంటాడు. అప్పుడు చిన్నప్పట్నించి నాన్న తననెలా చూసుకున్నాడో గుర్తొస్తుంది. “నా నోట్లో నుంచి ఫలానాది కావాలనే మాట బయటకు రాకముందే అది తెచ్చిచ్చేవాడు. అది చూసిన వాళ్లు ఆడపిల్ల పరాయి ఇంటి పిల్ల అవుతుంది. అంత గారాబం చేయొద్దు అనేవాళ్లు. కానీ, నేను పరాయి దాన్ని కాదు. అమ్మ నన్ను చిడియా (పక్షి) అని పిలుస్తుంది. నువ్వు పక్షివి. ఎప్పుడో ఒకప్పుడు నీ ఇంటికి నువ్వు ఎగిరి పోతావ్‌ నీ తిండి, నీళ్లు ఇంకెక్కడో ఉన్నాయి అనేది. కానీ ఆకాశమంతా పక్షిదే కదా.. వేరైపోవడం పరాయి అయిపోవడం ఏంటి? నేనేమన్నా దానం ఇచ్చే వస్తువునా? ఎందుకు కన్యాదానం? కన్యామాన్‌‌ అనొచ్చు కదా” అంటుంది. సరిగ్గా అప్పుడే తండ్రి కన్యాదానం చేయడం కోసం ఆమె చేతిని తీసుకుని అల్లుడి చేతిలో పెట్టబోతుంటే పెళ్లికొడుకు తల్లి.. కొడుకు చేతిని ముందుకు చాపకుండా ఆపుతుంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే.. ఆ అబ్బాయి చేతిని అలియా వాళ్ల అమ్మా నాన్నల చేతిలో పెడుతుంది. “ కొత్త ఆలోచన.. కన్యామాన్‌‌” అంటూ పెండ్లి కూతురి డ్రెస్‌‌లో ఉన్న అలియా నవ్వుతుంది. అయితే, నిజజీవితంలో కూడా ఈ యాడ్‌‌కు తను కనెక్ట్‌‌ అయ్యానని చెప్పింది అలియా. “నేను ఈ ఆలోచనను నమ్ముతాను. ఇది నా జీవితానికి దగ్గరగా ఉందనిపించింది. ఈ యాడ్‌‌ చేసినందుకు లక్కీగా ఫీల్‌‌ అవుతున్నా” అని చెప్పింది. “ సొసైటీలో చాలా మార్పులు వచ్చాయి. 
మారుతున్న అమ్మాయిల ఆలోచనలను బట్టే ఈ యాడ్‌‌ చేశాం”  అని యాడ్‌‌ డైరక్టర్‌‌‌‌ శ్రేయాన్స్‌‌ బెయిడ్‌‌ అన్నారు. “ సంప్రదాయాలు, ఆచారాల పట్ల గౌరవప్రదంగా ఉంటూనే... సాధారణ ప్రజల ఆలోచనా విధానాన్ని మార్చేందుకు మేం ఇలా ప్రయత్నిస్తున్నాం.”                                        - వేదాంత్‌‌ మోడీ, సీఎంవో, వేదాంత్‌‌ ఫ్యాషన్స్‌‌ లిమిటెడ్‌‌