కొత్త కోచ్ ను కపిల్‌‌ కమిటీనే ఎంపిక చేస్తుంది: రాయ్‌‌

కొత్త కోచ్ ను కపిల్‌‌ కమిటీనే ఎంపిక చేస్తుంది: రాయ్‌‌

న్యూఢిల్లీ: టీమిండియా కొత్త కోచ్‌‌ ఎంపిక అంశంలో కొద్ది రోజులుగా ఉన్న గందరగోళానికి తెరపడింది. కపిల్‌‌ దేవ్‌‌ నేతృత్వంలోని క్రికెట్‌‌ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) కోచ్‌‌ ఎంపికను పూర్తి చేస్తుందని సీఓఏ చీఫ్‌‌ వినోద్‌‌ రాయ్‌‌ స్పష్టం చేశారు. కోచింగ్‌‌ స్టాఫ్‌‌కు సంబంధించిన ఇంటర్వ్యూలు వచ్చే నెల మధ్యలో జరుగుతాయన్నారు. సీఏసీలో కపిల్‌‌, అన్షుమన్‌‌ గైక్వాడ్‌‌, శాంత రంగస్వామి సభ్యులుగా ఉన్నారు. కపిల్‌‌ నేతృత్వంలోని ఈ కమిటీ గతేడాది డిసెంబర్‌‌లో మహిళల జట్టు కోచ్‌‌గా డబ్ల్యూవీ రామన్‌‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. గతంలో రవిశాస్త్రిని ఎంపిక చేసిన సీఏసీలోని సచిన్‌‌, సౌరవ్‌‌, లక్ష్మణ్‌‌పై  పరస్పర విరుద్ధ ప్రయోజనాల కేసు సుప్రీంలో నడుస్తోంది. దీంతో ఈసారి కోచ్‌‌ ఎంపిక బాధ్యత కపిల్‌‌ కమిటీ చేతికి వెళ్లింది. అయితే బ్యాటింగ్‌‌, బౌలింగ్‌‌, ఫీల్డింగ్‌‌ కోచ్‌‌ ఎంపికలకు ఇంటర్వ్యూలు చేయడం వీళ్లకు కత్తిమీద సాముగా మారనుంది. మరోవైపు కెప్టెన్‌‌ విరాట్‌‌, వైస్‌‌ కెప్టెన్‌‌ రోహిత్‌‌ మధ్య ఎలాంటి విభేదాలు లేవని రాయ్‌‌ స్పష్టం చేశారు. రోహిత్‌‌ను కెప్టెన్‌‌గా చేయనున్నారనే వార్తలు అబద్దమన్నారు. అలాగే వరల్డ్‌‌కప్‌‌లో వైఫల్యంపై ఎలాంటి రివ్యూలు చేయడం లేదని చెప్పారు.