కరీంనగర్ టౌన్, వెలుగు: అధికారులు జిల్లాలోని ప్రతి స్కూల్‌ను సందర్శించి జనవరి 31లోపు అక్కడి మౌలిక వసతులు సహా అన్ని అంశాలపై నివేదిక సమర్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో పదో తరగతి పరీక్షల సన్నద్ధత, స్పెషల్ క్లాసెస్, ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు, విటమిన్ గార్డెన్ నిర్వహణ, ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు, తదితర అంశాలపై రివ్యూ నిర్వహించారు. స్కూళ్లను తనిఖీ చేసి మధ్యాహ్న భోజన తయారీలో గ్యాస్ కనెక్షన్లు వినియోగిస్తున్నది లేనిది పరిశీలించాలన్నారు. టాయిలెట్, తాగునీరు తదితర మౌలిక వసతులను పరిశీలించాలన్నారు.
అనంతరం ఎస్ఆర్ఆర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో తెలుగు విభాగం, తెలంగాణ కార్టూనిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండ్రోజుల పాటు నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి కార్టూన్ల ప్రదర్శనను కలెక్టర్ ప్రారంభించారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన కార్టూనిస్టుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అంతకుముందు కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ పాల్గొని,250 దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్‌బాబు, ఎస్ఆర్ఆర్ కాలేజీ ప్రిన్సిపాల్ రామకృష్ణ, తెలంగాణ కార్టూనిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జాకీర్ హుస్సేన్, ప్రధాన కార్యదర్శి రాజమౌళి, తదితరులు పాల్గొన్నారు.
