
- రిజిస్ట్రేషన్ చేస్తే బాధ్యులైన ఆఫీసర్లపై చర్యలు
- జిల్లా రిజిస్ట్రార్ పైనా సీరియస్ అయిన కలెక్టర్
- ‘వీ6 వెలుగు’లో ప్రచురితమైన కథనం ఎఫెక్ట్
- రిజిస్ట్రేషన్, రెవెన్యూ, మునిసిపల్ ఆఫీసర్లతో మీటింగ్
కరీంనగర్, వెలుగు: నిషేధిత జాబితాలోని భూము లకు రిజిస్ట్రేషన్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హెచ్చరించారు. ఆ భూముల జాబితాను అప్ డేట్ చేసి అందించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈనెల 2న వీ6 వెలుగు పేపర్ లో 'పైసలిస్తే.. ఏ భూమికైనా రిజిస్ట్రేషన్' పేరుతో కథనం ప్రచురితమైంది. అనంతరం తప్పంతా రెవెన్యూ శాఖదేనని, ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ ను డిమార్కేషన్ చేయకపోవడంతోనే సబ్ రిజిస్ట్రార్లు తెలియక రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని జిల్లా రిజిస్ట్రార్ ప్రవీణ్ కుమార్ 'వెలుగు' తో చెప్పడంతో రెవెన్యూ శాఖలో కలకలం సృష్టించింది. దీనిపై కలెక్టర్ స్పందించి.. బుధవారం కలెక్టరేట్ లో రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు, తహసీల్దార్లు, మునిసిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ .. జిల్లా రిజిస్ట్రార్ పై సీరియస్ అయినట్టు, తప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలిసింది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, మున్సిపల్ శాఖలు సమన్వయంతో పని చేస్తూ ప్రభుత్వ భూములను పరిరక్షించాలని ఆమె సూచించారు. నిషేధిత జాబితా భూముల సర్వే నంబర్లతో సమగ్ర రిపోర్ట్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో వేగవంతంగా పూర్తి చేయాలని స్పష్టంచేశారు. అన్ని శాఖల అధికారుల వద్ద అప్ డేట్ చేసిన నిషేధిత భూముల జాబితా ఉండాలని ఆదేశించారు.
ప్రభుత్వ భూములను గుర్తించి హద్దులు నిర్ణయించాలని పేర్కొన్నారు. నిషేధిత జాబితాలోని భూములు, ప్రభుత్వ స్థలాలు రిజిస్ట్రేషన్ చేయడం వల్ల కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్ గుర్తు చేశారు. రిజిస్ట్రేషన్ ఆఫీసుల ముందు నిషేధిత జాబితా సర్వేనంబర్లను సూచించే బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజలు ముందుంగా పరిశీలించుకుని, ఎలాంటి సమస్యలు లేని భూములనే కొనుగోలు చేయాలని ఆమె సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, డీఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్, రిజిస్ట్రేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.