V6 News

సెల్ఫ్ ఎన్యుమరేషన్ తో టైం ఆదా : కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా

సెల్ఫ్ ఎన్యుమరేషన్ తో టైం ఆదా : కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా
  •     ఆన్‌‌లైన్‌‌ ద్వారా ప్రజలే వివరాలు నమోదు చేసుకోవచ్చు
  •     కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్, వెలుగు: ప్రజలు తమ కుటుంబ సభ్యుల వివరాలను ఎవరికి వాళ్లుగా సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకోవడం ద్వారా జనగణన సమయం ఆదా అవుతుందని కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. త్వరలో ప్రతి ఇంటికి ఎన్యుమరేటర్లు వస్తారని, వారు వచ్చేలోపే ఆన్ లైన్ లో వివరాలు నమోదు చేసుకుని ఉంటే.. వారికి పని సులువవుతుందన్నారు. ఈ ప్రక్రియలో జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. సెల్ఫ్​ ఎన్యుమరేషన్ గురించి ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు 15 రోజులపాటు సాగుతుందన్నారు. జనగణనలో ఇంటి నివాసయోగ్య స్థితి, వసతులు, మతం, కులం,  కుటుంబ యజమాని పేరు, తాగునీటి వసతి వంటి 34 రకాల ప్రశ్నలు ఉంటాయని తెలిపారు. se.censes.gov.in అనే వెబ్ పోర్టల్ ద్వారా ప్రజలు తమ మొబైల్ నంబర్‌‌‌‌తో లాగిన్ అయి ఇంటిని జియో ట్యాగ్ చేసి, 34 వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. 

అనంతరం కలెక్టర్ స్వయంగా తన వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేసుకొని సెల్ఫ్ ఎన్యుమరేషన్ ను ప్రారంభించారు. ఆమెతోపాటు అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ప్రణాళిక అధికారి రామ్ దత్తారెడ్డి తమ వివరాలు నమోదు చేసుకున్నారు. కరీంనగర్ తీగలగుట్టపల్లిలోని తన నివాసంలో కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి  సెల్ఫ్ ఎన్యుమరేషన్‌‌లో తమ వివరాలను నమోదు చేసుకున్నారు. 

కరీంనగర్ టౌన్,వెలుగు: ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిని కరీంనగర్ కలెక్టరేట్‌‌లో ఘనంగా నిర్వహించారు. వాసవి మాత ఫొటోకు కలెక్టర్ చిత్రా మిశ్రా, ఆర్యవైశ్య ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.