కాంగ్రెస్ పాలనలో స్కాములే తప్ప.. స్కీముల్లేవ్... కరీంనగర్ కార్పొరేషన్పరిధిలో BRS నేతలకు అవగాహన సదస్సు

కాంగ్రెస్ పాలనలో స్కాములే తప్ప.. స్కీముల్లేవ్...  కరీంనగర్ కార్పొరేషన్పరిధిలో BRS నేతలకు అవగాహన సదస్సు
  •     మాజీ మంత్రి హరీశ్​ రావు ఫైర్ 

తిమ్మాపూర్, వెలుగు: కాంగ్రెస్  పాలనలో స్కాములే తప్ప.. స్కీముల్లేవని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కరీంనగర్​ కార్పొరేషన్​పరిధిలోని అలుగునూర్​లో బీఆర్ఎస్  నియోజకవర్గ నేతలకు సర్ పై మంగళవారం నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను సీఎం రేవంత్ రెడ్డి అధోగతి పాలు చేస్తున్నాడని విమర్శించారు. 

కాంగ్రెస్ అమలు చేస్తున్న ఏ స్కీమ్ చూసినా స్కామేననీ, స్కాం లేని డిపార్ట్​మెంటే  లేదన్నారు. -మంత్రులకు తెలియకుండా సీఎం టెండర్లు పిలుస్తున్నారని, మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్​ కుమార్​కు జిల్లాలో ఏం జరుగుతుందో కూడా తెలియదన్నారు. క్యాంపు ఆఫీసులకు, మెస్సీతో ఫుట్​బాల్​గేమ్​కు, అందాల పోటీలకు, రాహుల్​గాంధీకి మూటలిచ్చేందుకు, ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో యాడ్లు ఇచ్చేందుకు నిధులుంటాయని, రైతుబంధు, రీయింబర్స్​మెంట్​ వంటి స్కీమ్​లకు డబ్బులుండవా? అని ప్రశ్నించారు. ఇప్పుడు అందరూ బీఆర్ఎస్  వైపు చూస్తున్నారని, కాంగ్రెస్  కార్యకర్తలు కూడా ఆ పార్టీకి ఓటేసే పరిస్థితి లేదన్నారు. 

అర్హులైన ఓటర్ల పేర్లు లిస్టులోనుంచి తొలగించకుండా బూత్  లెవెల్  ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీఆర్ఎస్​ ప్రధాన కార్యదర్శి టి జీవన్​రెడ్డి మాట్లాడుతూ మేడిగడ్డ వద్ద కుంగిన రెండు పిల్లర్లను సరి చేసి సాగుకు నీళ్లవ్వలేకపోతున్నారని విమర్శించారు. రేవంత్  అంటున్న కూలేశ్వరం ప్రాజెక్ట్.. భవిష్యత్​ తెలంగాణకు గుండెకాయలా మారతుందన్నారు. 

కరీంనగర్  ఎమ్మెల్యే గంగుల కమలాకర్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మానకొండూర్  మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బీఆర్ఎస్  జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ మేయర్  సర్దార్  రవీందర్ సింగ్  పాల్గొన్నారు.