దేశంలోనే ఉత్తమ కో ఆపరేటివ్ బ్యాంక్గా కరీంనగర్

దేశంలోనే ఉత్తమ కో ఆపరేటివ్ బ్యాంక్గా కరీంనగర్

కరీంనగర్ జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్(డీసీసీబీ) 2021 -22 ఆర్థిక సంవత్సరానికి దేశంలో ఉత్తమ కో-ఆపరేటివ్ బ్యాంకుగా ఎంపికైంది. గత ఏడేళ్లుగా జాతీయ ఉత్తమ అవార్డులు అందుకోవడం ఇది వరుసగా ఏడోసారి. 2020 -21లో కూడా జాతీయ స్థాయిలో రెండో ఉత్తమ బ్యాంకుగా కరీంనగర్ డీసీసీ బ్యాంకు అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. 

ఆల్ రౌండ్ పనితీరు ఆధారంగా ఏటా ఈ అవార్డులను ప్రతిష్టాత్మక నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్(NAFSCOB) అందిస్తూ ఉంటుంది. దేశంలోని మొత్తం 393 డీసీసీబీలలో కరీంనగర్ డీసీసీబీ వరుసగా ఏడు సార్లు అవార్డులు అందుకోవడం విశేషం. సెప్టెంబర్ 26వ తేదీన  రాజస్థాన్ లోని జైపూర్‌లో జరిగే కార్యక్రమంలో కరీంనగర్ డీసీసీబీ సీఈవో ఎన్ సత్యనారాయణ ఈ అవార్డులను అందుకోనున్నారు. 

కరీంనగర్ డీసీసీబీ.. 2015 -2016లో అఖిల భారత స్థాయిలో ద్వితీయ, 2016- 17లో తృతీయ బహుమతి, 2017- 2018లో ద్వితీయ, 2018 -19 సంవత్సరంలో ప్రథమ బహుమతిని కైవసం చేసుకుంది. 2020 -21 లో ద్వితీయ బహుమతి అందుకున్న ఈ బ్యాంకు 2021 -22 సంవత్సరానికి సంబంధించి మొదటి స్థానంలో నిలిచింది. జాతీయ బెస్ట్ బ్యాంకు అవార్డును గెలుచుకున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు బ్యాంకు అధికారులు సిబ్బంది.

విశేషమేమిటంటే కరీంనగర్ డీసీసీబీ ఛైర్మన్ గా ఉన్న కొండూరు రవీందర్ రావు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంకు(TSCOB) ఛైర్మన్ గానూ, NAFSCOB ఛైర్మన్ గానూ ఉన్నారు. వ్యాపారంలో వృద్ధిని నమోదు చేయడంతో పాటు, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడం, టెక్నాలజీ వినియోగం, లాభాలు వంటి ప్రాతిపదికన జాతీయ స్థాయిలో కరీంనగర్ డీసీసీబీ తొలి స్థానంలో నిలిచింది. 

మరోవైపు.. కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి(పీఎసీఎస్) కూడా 2021- 22 ఆర్థిక సంవత్సరానికి దేశంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన PACSలలో  NAFSCOB మొదటి బహుమతిని గెలుచుకుంది. చొప్పదండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఇంతకుముందు 2017- 18, 2018 -19, 2019 -20 ఆర్థిక సంవత్సరాలలో జాతీయ అవార్డులను గెలుచుకోవడం విశేషం.