యూరియా కోసం.. రైతు వేదిక వద్ద రాత్రంతా పడుకున్న రైతులు

యూరియా కోసం..  రైతు వేదిక వద్ద రాత్రంతా పడుకున్న రైతులు
  • అడ్వాన్స్​ టోకెన్ల కోసం హైవేపై రాస్తారోకో

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: రూరల్  మండలంలోని బొక్కలోనిపల్లి గ్రామ రైతులకు కోడూరు గ్రామంలోని రైతువేదిక దగ్గర గురువారం యూరియా టోకెన్లు ఇస్తామని అధికారులు ప్రకటించారు. దీంతో బుధవారం రాత్రి 11 గంటలకు రైతులు వచ్చి కోడూరు రైతు వేదిక దగ్గర లైన్ లో చెప్పులు, ఇటుకలు పెట్టి అక్కడే నిద్రించారు. ఇదిలాఉంటే కోటకద్ర గ్రామంలోని రైతువేదిక దగ్గర రైతులకు గురువారం  టోకెన్లు ఇచ్చారు. విషయం తెలుసుకున్న మండలానికి చెందిన రైతులంతా యూరియా కోసం గ్రామానికి రావడంతో  వ్యవసాయ అధికారులు కొందరికి మాత్రమే టోకెన్లు ఇచ్చారు. 

దీంతో ఆగ్రహించిన రైతులు తమకు యూరియా ఇవ్వాలని కోటకద్ర స్టేజ్  దగ్గర రాయచూరు రోడ్డుపై బైఠాయించారు. కలెక్టర్  వచ్చి న్యాయం చేయాలని రోడ్డుపై కంప, రాళ్లు అడ్డంగా పెట్టి ఆందోళనకు దిగారు. దీంతో ట్రాఫిక్  జామ్  అయింది. రైతులకు అడ్వాన్స్  టోకెన్లు ఇస్తామని వ్యవసాయ అధికారులు చెప్పి అప్పయ్యపల్లి సొసైటీలో టోకెన్లు అందజేశారు. అక్కడ రైతులందరికీ టోకెన్లు ఇవ్వకపోవడంతో అప్పాయిపల్లి దగ్గర హైవేపై మరోసారి ధర్నా చేశారు. పోలీసులు కలగజేసుకొని రైతులకు టోకెన్లు ఇచ్చి సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు.