
- 18 తులాల గోల్డ్, 20 తులాల వెండి, రూ.5 లక్షల నగదు చోరీ
- హనుమకొండ జిల్లాలోని కోమటిపల్లి మధు తండాలో ఘటన
హనుమకొండ, వెలుగు: కుటుంబ పెద్ద అస్థికలను గోదావరిలో కలిపేందుకు వెళ్లొచ్చేలోపు ఇంట్లో చోరీ జరిగింది. 18 తులాల బంగారం, 20 తులాల వెండి, రూ.5 లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లిన ఘటన హనుమకొండ జిల్లాలో జరిగింది. బాధిత కుటుంబం, పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ కాకతీయ వర్సిటీ పీఎస్ పరిధిలోని కోమటిపల్లి మధు తండాకు చెందిన పోరిక భీమా నాయక్ ఈనెల6న అనారోగ్యంతో చనిపోయాడు.
ఆయన అస్థికలను గోదావరిలో కలిపేందుకు కుటుంబ సభ్యులు గత మంగళవారం రాత్రి11 గంటల సమయంలో కాళేశ్వరం బయలుదేరి వెళ్లారు. బుధవారం సాయంత్రం తిరిగి రాగా.. ఇంటి తాళం పగులగొట్టి, లోపల సామగ్రి చిందరవందరగా పడి ఉంది. ఇంట్లో చోరీ జరిగినట్టు గుర్తించి వెంటనే బాధిత కుటుంబసభ్యులు కేయూ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.