ఎన్నికల ప్రక్రియను నాశనం చేసేందుకు ఈసీ కుట్రలు: ప్రియాంకా గాంధీ

ఎన్నికల ప్రక్రియను  నాశనం చేసేందుకు ఈసీ కుట్రలు: ప్రియాంకా గాంధీ
  • ఈసీ ప్రజాస్వామ్యాన్ని సవాల్​చేస్తున్నది

వయనాడ్: కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, వయనాడ్ ఎంపీ ప్రియాంకా గాంధీ ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియను ధ్వంసం చేసే కుట్ర పన్నుతోందని, ప్రజాస్వామ్యాన్ని సవాలు చేస్తోందని ఆమె అన్నారు. గురువారం (సెప్టెంబర్ 18) కేరళ రాష్ట్రం వయనాడ్‌లోని ముట్టిల్‌లో వయనాడ్ ముస్లిం ఆర్ఫనేజ్ వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. 

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ న్యూఢిల్లీలో నిర్వహించిన ప్రెస్ మీట్‌ను దేశ ప్రజలంతా చూడాలని కోరారు. దేశంలో ఏం జరుగుతోందో అర్థం చేసుకోవాలని, ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడేందుకు అందరూ ఏకమై పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. 

రాహుల్ గాంధీ కర్నాటకలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గ డేటాను ఉదాహరిస్తూ, కాంగ్రెస్ మద్దతుదారుల ఓట్లను ఎన్నికల ముందు క్రమంగా తొలగిస్తున్నారని ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలన్ని తప్పని, నిరాధారమని ఎన్నికల సంఘం ఖండించింది.