ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లలో‌‌ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఫస్ట్

ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లలో‌‌ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఫస్ట్
  •     రాష్ట్రంలో టాప్ టెన్ పట్టణాల్లో ఆరు మనవే.. 
  •     సిరిసిల్ల, హుజూరాబాద్, కోరుట్ల, జమ్మికుంట మున్సిపాలిటీల్లో 92 శాతం దాటిన వసూళ్లు
  •     90 శాతం వడ్డీ మాఫీకి నేటితో ముగియనున్న గడువు

కరీంనగర్, వెలుగు : మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో స్పెషల్ డ్రైవ్ లా నిర్వహిస్తున్న ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మున్సిపాలిటీలు అగ్ర స్థానంలో నిలిచాయి. రాష్ట్రంలో 90 శాతంపైగా పన్నులు వసూలైన మొదటి 10 మున్సిపాలిటీల్లో ఆరు ఉమ్మడి జిల్లాకు చెందినవి కావడం విశేషం. వీటిలో రూ.5.46 కోట్లు(97.49 శాతం) వసూళ్లతో సిరిసిల్ల రాష్ట్రంలోనే ఫస్ట్ ప్లేస్ లో నిలవగా, రూ.2.34 కోట్ల(93.93 శాతం)తో హుజూరాబాద్ రాష్ట్రంలో మూడో స్థానంలో, రూ.3.87 కోట్ల(93.30 శాతం) వసూళ్లతో కోరుట్ల ఐదో స్థానంలో,  రూ.2.83 కోట్ల(923.25)తో జమ్మికుంట ఆరో స్థానంలో నిలిచాయి.

ఫిబ్రవరి నెలాఖరు వరకు సగం కూడా వసూలు కాని పన్నులు.. 90 శాతం వడ్డీ మాఫీ ఆఫర్‌‌‌‌ ప్రకటించడంతో నెల రోజుల్లో టార్గెట్‌‌కు  చేరువయ్యాయి. కరీంనగర్ సిటీలో బీఎస్ఎన్ఎల్ ఆఫీసు కు సంబంధించి రూ.1,08,96,840 ప్రాపర్టీ ట్యాక్స్ బకాయి ఉండగా.. ఇందులో వడ్డీపై 90 శాతం మాఫీ కింద రూ.43,18,091 రద్దు చేశారు. వన్ టైం సెటిల్ మెంట్ కింద మిగతా రూ.65,78,749 ఆఫీసర్లు చెల్లించారు. అలాగే డీటీవో ఆఫీస్ నుంచి రూ.7,90,080 వసూలు చేశారు. 

ఉమ్మడి జిల్లాలో వసూళ్లు ఇలా.. 

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లు మెరుగ్గానే ఉన్నాయి. కరీంనగర్ బల్దియా పరిధిలో మొత్తం రూ.34.83 కోట్లు వసూలు కావాల్సి ఉండగా...రూ.30.98 కోట్లు(88.95 శాతం) వసూలయ్యాయి. మరో రూ.3.85 కోట్లు వసూలు కావాల్సి ఉంది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో రూ.11.76 కోట్లకు గానూ రూ.7.50 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. మరో 4.26 కోట్లు రావాల్సి ఉంది. జగిత్యాల మున్సిపాలిటీలో రూ.12.56 కోట్లకుగానూ రూ.7.20 కోట్లు వసూలు కాగా మరో రూ. 5.36 కోట్లు వసూలవ్వాల్సి ఉంది. అలాగే మెట్ పల్లి మున్సిపాలిటీలో రూ.2.99 కోట్లకుగానూ

రూ.2.71 కోట్లు,  వేములవాడలో రూ.3.80 కోట్లకుగానూ రూ.3.39 కోట్లు, రాయికల్ లో రూ.1.17 కోట్లకు గానూ రూ.99 లక్షలు, పెద్దపల్లిలో రూ.4.60 కోట్లకుగానూ రూ.3.80 కోట్లు, మంథనిలో రూ.1.67 కోట్లకు రూ.1.36 కోట్లు, కొత్తపల్లిలో రూ.2.51 కోట్లకుగానూ రూ.1.95 కోట్లు, చొప్పదండిలో రూ.2.39 కోట్లకు గానూ రూ.1.62 కోట్లు వసూలయ్యాయి. ధర్మపురి పట్టణంలో రూ.1.06 కోట్లకుగానూ రూ.59 లక్షలు మాత్రమే వసూలుకాగా, సుల్తానాబాద్ రూ.2.60 కోట్లకుగానూ రూ.1.42 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. 

వడ్డీ మాఫీ ఆఫర్ నేటితో క్లోజ్.. 

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కోట్లాది రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్ ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉంది. కొందరు రెగ్యులర్ గా చెల్లిస్తున్నప్పటికీ.. మరికొందరు మాత్రం మూడు, నాలుగేళ్లుగా ట్యాక్స్ కట్టడం లేదు. దీంతో మొండి బకాయిలు వసూలు చేసేందుకు, ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు వన్ టైం సెటిల్ మెంట్ కింద ప్రాపర్టీ ట్యాక్స్‌‌పై వేసిన వడ్డీలో 90 శాతాన్ని ప్రభుత్వం మాఫీ చేసింది.

ఈ ఆఫర్ ఆదివారంతో ముగియనుంది. ఇప్పుడు చెల్లించుకుంటే మొత్తం వడ్డీని వచ్చే ఆర్థిక సంవత్సరంలోనైనా చెల్లించాల్సి వస్తుందని, ఇప్పుడు చెల్లిస్తేనే వడ్డీపై మాఫీ వర్తిస్తుందని మున్సిపల్ అధికారులు చెప్తున్నారు. చివరి రోజు ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్ల కోసం ఆఫీసులు తెరిచే ఉంటాయని తెలిపారు.