
కరీంనగర్ క్రైం, వెలుగు: గుండెపోటుతో కరీంనగర్ పోలీస్ టైనింగ్ సెంటర్ డీఎస్పీ మృతి చెందాడు. టౌన్ లోని కట్టరాంపూర్ కాలనీకి చెందిన డీఎస్పీ జీదుల మహేశ్ బాబు(56), హుజూరాబాద్ ఏసీపీ మాధవి దంపతులకు ఇద్దరు కొడుకులు రుషి ఫణీంద్ర, మీరజ్ చంద్ర ఉన్నారు. 25 ఏండ్ల కింద ఆయన కిడ్నీ సమస్యతో బాధపడగా అతని తండ్రి కిడ్నీ ఇచ్చారు. అనంతరం మళ్లీ కొన్నాళ్లుగా కిడ్నీ సమస్య రావడంతో డయాలసిస్ చేయించుకుంటున్నారు. తన భార్య వద్దకు వెళ్లిన మహేశ్ బాబుకు శుక్రవారం ఉదయం ఒక్కసారిగా గుండెపోటు రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు.
1994 బ్యాచ్ ఎస్ఐగా మహేశ్‌బాబు, 1995 బ్యాచ్ గా ఎస్ఐ మాధవి ఎంపికై ప్రేమవివాహం చేసుకున్నారు. దంపతులిద్దరూ పదోన్నతులు పొందుతూ డీఎస్పీ, ఏసీపీ స్థాయికి వెళ్లారు. డీఎస్పీ మృతికి కరీంనగర్ సీపీ గౌస్ ఆలం, పలువురు పోలీసు ఉన్నతాధికారులు ఆయన ఇంటికి వెళ్లి నివాళులర్పించారు. పోలీస్ శాఖకు మహేశ్చేసిన సేవలు మరువలేనివని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ చార్జ్ వెలిచాల రాజేందర్ రావు, పలువురు నేతలు కొనియాడుతూ తమ సంతాపం తెలిపారు.