
- ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్
- రెబల్‌గా పోటీ చేసిన సింగ్
హైదరాబాద్, వెలుగు: కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ గురువారం సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. సీఎం ఆయనను స్వయంగా ప్రగతి భవన్‌కు పిలిపించుకున్నారు. అనుచరులు, సిక్కు మత పెద్దలతో పాటు సింగ్ సీఎంను కలిశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన పరిణామాలను వివరించినట్టు సమాచారం. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమస్యలు, కరీంనగర్ జిల్లాకు అభివృద్ధి కార్యక్రమాలు, సిక్కుల సమస్యలను సీఎంకు చెప్పానని సింగ్ మీడియాకు వివరించారు. వాటన్నింటినీ త్వరలో పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చారన్నారు.
రవీందర్ సింగ్ స్థానిక సంస్థల కోటాలో కరీంనగర్ నుంచి ఎమ్మెల్సీ సీటు ఆశించడం, టికెటివ్వకపోవడంతో టీఆర్ఎస్ ను వీడి రెబల్‌గా 232 ఓట్లు సాధించి పార్టీ అభ్యర్థికి గట్టి పోటీ ఇవ్వడం తెలిసిందే. ఉద్యమ సమయం నుంచి టీఆర్‌ఎస్‌లో రవీందర్ సింగ్ చురుగ్గా పని చేశారు. తెలంగాణ వచ్చాక కరీంనగర్ మేయర్ అయ్యారు. 2019లోనూ కార్పొరేటర్‌గా గెలిచినా మేయర్ చాన్స్ రాలేదు. ఎమ్మెల్సీగా చాన్సిస్తానన్న హామీని నిలబెట్టుకోలేదు గనుక పార్టీని వీడుతున్నట్టు ఎన్నికలప్పుడు కేసీఆర్‌కు లేఖ రాశారు. తనపై కోపంతో సోదరుడి దుకాణాన్ని టీఆర్ఎసోళ్లు కూల్చేశారంటూ ఆందోళనకు దిగారు.