- పలు చోట్ల అండర్ పాస్ లు లేకుండానే రహదారి నిర్మాణం
- రోడ్డు దాటుతూ ప్రమాదాలబారిన పడుతున్న స్థానికులు
కరీంనగర్, వెలుగు: కరీంనగర్–హన్మకొండ మధ్య ఫోర్ లేన్ నేషనల్ హైవే నిర్మాణంతో ప్రయాణం సౌకర్యంగా మారినప్పటికీ.. హైవే వెంట ఉన్న గ్రామస్తులు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అండర్ పాస్‌లు లేకపోవడంతో కరీంనగర్ జిల్లాలోని కొత్తగట్టు, గొల్లపల్లి, ఖాదర్ గూడెం, శంషాబాద్ గ్రామాల ప్రజలు రోడ్డు ఇవతలి నుంచి అవతలి వైపు వెళ్లేందుకు హైవేను దాటుతూ ప్రమాదాల బారినపడుతున్నారు. పలువురు ప్రాణాలు కోల్పోగా.. కొందరు గాయాలపాలయ్యారు. అండర్ పాస్‌లు నిర్మించాలని ఇప్పటికే పలుమార్లు ఆందోళనలు నిర్వహించినప్పటికీ నేషనల్ హైవే అధికారులు స్పందించడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రెండుగా చీలిన ఊళ్లు
నేషనల్ హైవే నిర్మాణంతో కొన్ని గ్రామాలు రెండుగా చీలిపోయాయి. హన్మకొండ నుంచి కరీంనగర్ వరకు రహదారి వెంట ఉన్న మానకొండూరు, శంకరపట్నం, హుజురాబాద్, ఎల్కతుర్తి లాంటి మండల కేంద్రాలను బైపాస్ చేస్తూ రహదారిని నిర్మించారు. కానీ మిగతా చోట్ల మాత్రం గతంలో గ్రామాల మీదుగా వెళ్లిన పాత రహదారినే విస్తరించారు. దీంతో చెంజర్ల, గట్టుదుద్దెనపల్లి, గొల్లపల్లి, కొత్తగట్టు గ్రామాలు రెండుగా చీలిపోయాయి. నేషనల్ హైవేపై వేగంగా వెళ్లే వాహనాలకు మనుషులు అడ్డుగా వస్తే కంట్రోల్ కాక ఢీకొనే ప్రమాదముంది. కానీ స్థానికులు పనుల మీద ఇవతలి, అవతలికి వెళ్లేందుకు రెయిలింగ్ మీదుగా దూకి రోడ్డు దాటక తప్పడం లేదు. ఈ క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఆరు గ్రామాలకు హైవే తిప్పలు
నేషనల్ హైవే నిర్మాణంలో అండర్ పాస్‌లు, సర్వీసు రోడ్లు లేని కారణంగా కరీంనగర్ జిల్లాలో 6 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్డు దాటుతున్నామని.. తమ గ్రామాల్లోనూ అండర్ పాస్‌లు, సర్వీస్ రోడ్లు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.
- హైవే నిర్మాణంతో గట్టుదుద్దెనపల్లి గ్రామం రెండుగా విడిపోయింది. అండర్ పాస్ కోసం నిర్మించిన ఫ్లైఓవర్‌తో ఒకవైపు ఉన్న వాళ్లకు మరోవైపు ఉన్న ఇండ్లు కనిపించకుండాపోయాయి. గ్రామ రూపురేఖలే మారిపోయాయి.
- కరీంనగర్ నుంచి ఈదులగట్టెపల్లికి వెళ్లేందుకు సర్వీస్ రోడ్డు లేదు. నిర్మాణాన్ని అధికారులు విస్మరించారు. దీంతో వాహనదారులు రోడ్డును అడ్డంగా దాటుతూ ఈదులగట్టెపల్లికు వెళ్తున్నారు.
- హైవేతో రెండుగా చీలిపోయిన మానకొండూరు మండలం ఖాదర్ గూడెం వద్ద కూడా అండర్ పాస్ లేకపోవడంతో గ్రామ ప్రజలు వాహనాలపై రోడ్డు దాటాలంటే మూడు కిలోమీటర్ల దూరంలోని చెంజర్ల దగ్గర ఉన్న యూటర్న్ వరకు వెళ్లాల్సి వస్తోంది. గ్రామం వద్ద హైవేలోకి ఎంటర్ కాకుండా రెండు వైపులా రెయిలింగ్ ఏర్పాటు చేశారు. దీంతో రోడ్డు మీదికి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది.
- మానకొండూరు మండలం శంషాబాద్ కూడా రెండుగా విడిపోయింది. అండర్ పాస్ నిర్మించలేదు. దీంతో వ్యవసాయ భూముల వద్దకు వెళ్లాలంటే గట్టుదుద్దెనపల్లి అండర్ పాస్ వరకు వెళ్లాల్సి వస్తోంది. లేదంటే ప్రాణాలకు తెగించి రెయిలింగ్ దూకి రోడ్డు దాటుతున్నారు.
- శంకరపట్నం మండలం కొత్తగట్టు వద్ద టోల్ ప్లాజా ఏర్పాటు చేసిన అధికారులు.. ఆ గ్రామంలో అండర్ పాస్ ఏర్పాటు చేయడం మరిచారు. దీంతో రోడ్డు దాటాలంటే టోల్ ప్లాజా వరకు వచ్చి తిరిగి వెళ్లాల్సి వస్తోంది.
- మానకొండూర్ మండలం శ్రీనివాసనగర్ గ్రామమంతా ఒక వైపు, వ్యవసాయ భూములు మరోవైపు అయ్యాయి. ఇప్పుడు తమ పొలాలకు వెళ్లేందుకు రెండు, మూడు కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వసోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దినదిన గండంగా మారింది..
గొల్లపల్లి, కొత్తగట్టులో అండర్ పాస్ లేకపోవడం వల్ల రోడ్డు దాటడం దినదినగండంగా మారింది. అండర్ పాస్ నిర్మిస్తామని ఆఫీసర్లు మాట ఇచ్చి తప్పారు. కొత్తగట్టు ప్రజలు రోడ్డు దాటాలంటే 2 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. ప్రజలతోపాటు పశువులకు రోడ్డు దాటేందుకు ఇబ్బంది అవుతోంది. రోడ్డు దాటుతూ ఓ కూలీతోపాటు బైక్ మీద వెళ్తూ లక్ష్మణ్, రోడ్డు దాటేందుకు రాత్రి రాంగ్ రూట్ లో వెళ్తూ కమలాకర్ యాక్సిడెంట్ లో చనిపోయారు. - మాడ వెంకట్ రెడ్డి, కొత్తగట్టు
