పైసలిస్తే.. ఏ భూమికైనా.. రిజిస్ట్రేషన్..మొత్తం సెట్‌‌‌‌‌‌‌‌ చేసి పెడుతున్న డాక్యుమెంట్‌‌‌‌‌‌‌‌ రైటర్లు

పైసలిస్తే.. ఏ భూమికైనా..  రిజిస్ట్రేషన్..మొత్తం సెట్‌‌‌‌‌‌‌‌ చేసి పెడుతున్న డాక్యుమెంట్‌‌‌‌‌‌‌‌ రైటర్లు
  •  కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో బయటపడుతున్న సబ్‌‌‌‌‌‌‌‌రిజిస్ట్రార్ల అక్రమాలు
  • తమ చేతికి మట్టి అంటకుండా పనికానిచ్చేస్తున్న రిజిస్ట్రార్లు

కరీంనగర్‌‌‌‌‌‌‌‌కు కూత వేటు దూరంలో ఉన్న రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో సబ్‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌ సెలవుపై వెళ్లారంటే చాలు.. అదే రోజు ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇదేంటని ఆరా తీస్తే అసలు అధికారి రిజెక్ట్‌‌‌‌‌‌‌‌ చేసిన డాక్యుమెంట్లన్నింటినీ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి సబ్‌‌‌‌‌‌‌‌రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌ క్లియర్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నట్లు బయటపడింది. ఇందుకోసం రూ.లక్షల్లో చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు సబ్‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌ పరిధిలోని గ్రామంలో ఇటీవల   ఓ రైస్‌‌‌‌‌‌‌‌ మిల్లుకు సంబంధించిన భూమిని నిబంధనలకు విరుద్ధంగా పార్టిషియన్‌‌‌‌‌‌‌‌ చేసి రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ చేసినందుకు సదరు ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి     సబ్‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌కు రూ.10 లక్షలు ముట్టజెప్పినట్లు తెలిసింది. 

కరీంనగర్, వెలుగు : ఓ వైపు ఏసీబీ దాడులు.. మరో వైపు ఎంక్వైరీలు, సస్పెన్షన్లు జరుగుతున్నా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రిజిస్ట్రేషన్ల శాఖలో సబ్‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రార్ల దందా మాత్రం ఆగడం లేదు. అన్నీ సరిగ్గా ఉంటే ఒక్కో డాక్యుమెంట్‌‌‌‌‌‌‌‌కు రూ. 10 వేలు, ఏదైనా సమస్య ఉంటే రూ.లక్షల్లో వసూలు చేస్తూ రిజిస్ట్రేషన్లు కానిచ్చేస్తున్నారు. లక్షలు, కోట్ల రూపాయలకు సంబంధించిన వ్యవహారం కావడంతో రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌కు వెళ్లిన వారు సైతం ఎంతో కొంత ముట్టజెప్పి పని చేయించుకుంటున్నారు. ఇదే సబ్‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రార్లకు వరంగా మారింది. 

రైటర్లతోనే అన్ని పనులు

కరీంనగర్‌‌‌‌‌‌‌‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 14 సబ్‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌ ఆఫీసులు ఉన్నాయి. అంతటా కలిపి ఏటా 40 వేల వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. డబ్బులు ముట్టజెప్పనిదే ఏ ఒక్క రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ కూడా ముందుకు కదలదు. ఈ వ్యవహారంలో సబ్‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రార్లు డైరెక్ట్‌‌‌‌‌‌‌‌గా తెరపైన కనిపించకుండా... డాక్యుమెంట్‌‌‌‌‌‌‌‌ రైటర్ల మధ్యవర్తిత్వంతో తమ చేతికి మట్టి అంటకుండా దందా సాగిస్తున్నారు. 

ఒక్కో డాక్యుమెంట్‌‌‌‌‌‌‌‌కు కనీసం రూ.5 వేలు లెక్కేసినా ఏటా రూ.20 కోట్ల మేర రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ శాఖ ఆఫీసర్లు, సిబ్బంది జేబుల్లోకే వెళ్తోందని అంచనా. భూమి పత్రాల్లో ఏ చిన్న సమస్య ఉన్నా.. భూమి విషయంలో వివాదం ఉన్నా రూ.లక్షల్లో ముట్జజెప్పాల్సిందే. ఆఫీసర్లు అడిగినంత ముట్టజెప్పితే అసైన్డ్, గవర్నమెంట్, వక్ఫ్, దేవాదాయ శాఖ భూముల్లాంటి ప్రొహిబిటెడ్‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌లోని భూములను సైతం రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ చేసేస్తున్నారు.

ఇటీవల గంగాధర సబ్‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో వెలుగు చూసిన వ్యవహారమే ఇందుకు నిదర్శనం. గంగాధర సబ్‌‌‌‌‌‌‌‌రిజిస్ట్రార్ ఆఫీసులో కొత్తపల్లిలోని సీలింగ్‌‌‌‌‌‌‌‌ భూములకు సంబంధించిన 476  డాక్యుమెంట్లను లోకాయుక్త ఆదేశాల మేరకు మే చివర్లో ఆర్డీవో క్యాన్సిల్‌‌‌‌‌‌‌‌ చేసిన విషయం తెలిసిందే. అసైన్డ్‌‌‌‌‌‌‌‌ భూములకు సంబంధించి తాను అక్రమంగా చేసిన 9 రిజిస్ట్రేషన్లను జూన్ 26, 28 తేదీల్లో గంగాధర సబ్‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రార్ క్యాన్సిల్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఈ క్రమంలోనే కరీంనగర్‌‌‌‌‌‌‌‌ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇంటి నంబర్లతో అక్రమంగా జరిగిన 202 రిజిస్ట్రేషన్ల వ్యవహారం వెలుగుచూసింది. ఇలాంటి అక్రమ రిజిస్ట్రేషన్లలో కోట్లాది రూపాయలు చేతులు మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇటీవల జరిగిన ఘటనలు

  •  కొత్తపల్లి హవేలీలో 272/14 సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌లో 20 గుంటల అసైన్డ్‌‌‌‌‌‌‌‌ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ చేయడంతో గంగాధర సబ్‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌ నూర్‌‌‌‌‌‌‌‌ అఫ్జల్‌‌‌‌‌‌‌‌ఖాన్‌‌‌‌‌‌‌‌ను సస్పెండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. జూన్‌‌‌‌‌‌‌‌ 26నే సస్పెన్షన్‌‌‌‌‌‌‌‌ ఉత్తర్వులు జారీ అయినా అవి ఆయనకు అందలేదు. 26, 28 తేదీల్లో ఆఫీసుకు వచ్చి తాను చేసిన 9 రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్‌‌‌‌‌‌‌‌ చేసుకునే వెసులుబాటు ఇవ్వడం వెనుక అదే శాఖకు ఉన్నతాధికారి హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 
  • గతేడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 27న గిఫ్ట్‌‌‌‌‌‌‌‌ డీడ్‌‌‌‌‌‌‌‌ చేసేందుకు కొక్కుల రాజేశం నుంచి ఇదే గంగాధర సబ్‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌ శివారం సురేశ్‌‌‌‌‌‌‌‌ రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. 
  • గతేడాది ఆగస్ట్‌‌‌‌‌‌‌‌లో అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో హుజురాబాద్‌‌‌‌‌‌‌‌ సబ్‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌ మసూద్‌‌‌‌‌‌‌‌ అలీపై సస్పెన్షన్‌‌‌‌‌‌‌‌ వేటు పడింది. 
  • ఈ ఏడాది జనవరి 15న మెట్‌‌‌‌‌‌‌‌పల్లిలో మార్టిగేజ్‌‌‌‌‌‌‌‌ పేపర్ల కోసం రూ.5 వేలు లంచం తీసుకుంటూ సబ్‌‌‌‌‌‌‌‌రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌, డాక్యుమెంట్‌‌‌‌‌‌‌‌ రైటర్‌‌‌‌‌‌‌‌, సిబ్బంది ఏసీబీ ఆఫీసర్లకు చిక్కారు.
  •  భూమి రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ కోసం లంచం డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేసి, తన ఆఫీస్‌‌‌‌‌‌‌‌ అటెండర్‌‌‌‌‌‌‌‌ ద్వారా రూ.60 వేలు లంచం తీసుకుంటూ పెద్దపల్లి సబ్‌‌‌‌‌‌‌‌రిజిస్ట్రార్ దేవనగిరి నిర్మల 2023 ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఏడాది జనవరిలో తప్పుడు డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ చేశారని బాధితులు పెద్దపల్లి సబ్‌‌‌‌‌‌‌‌రిజిస్ట్రార్ ఆఫీసులో స్టాఫ్‌‌‌‌‌‌‌‌తో గొడవకు దిగారు.
  • తిమ్మాపూర్‌‌‌‌‌‌‌‌ మండలం రామకృష్ణ కాలనీలో ఒకే ఇంటి నంబర్‌‌‌‌‌‌‌‌తో 24 ఇండ్ల స్థలాలను రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ చేసిన తిమ్మాపూర్ సబ్‌‌‌‌‌‌‌‌రిజిస్ట్రార్ మైసయ్యను రెండేండ్ల కింద సస్పెండ్‌‌‌‌‌‌‌‌ చేశారు.

ప్రొహిబిటెడ్‌‌‌‌‌‌‌‌ స్థలాలని తెలియక రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నరు 

ప్రొహిబిటెడ్‌‌‌‌‌‌‌‌ భూములను రెవెన్యూ శాఖ సరైన పద్ధతిలో డీమార్కేషన్‌‌‌‌‌‌‌‌ చేయకపోవడంతో సబ్‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రార్లు తెలియక రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. కొన్ని ప్రొహిబిటెడ్ సర్వే నంబర్లలో పట్టా భూములు కూడా ఉండడంతో ఏవి ప్రొహిబిటెడ్‌‌‌‌‌‌‌‌ భూములో.. కానివి ఏవో తెలియడం లేదు. ఆ క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖదే. వారు ఆ పని చేయకుంటే మేమేం చేయగలం. అందుకే రిజిస్ట్రేషన్లు చేయాలంటే చాలా మంది సబ్‌‌‌‌‌‌‌‌రిజిస్ట్రార్లు భయపడుతున్నారు. సబ్‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌ సస్పెన్షన్‌‌‌‌‌‌‌‌ తర్వాత ఒత్తిడిలో పనిచేస్తున్నారు. ఫీల్డ్‌‌‌‌‌‌‌‌కు వెళ్లి భూమిని చూసి రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ చేయాలంటే రోజుకు ఒకటి, రెండుకు మించి రిజిస్ట్రేషన్లు జరగవని కరీంనగర్ జిల్లా రిజిస్ట్రార్‌ ప్రవీణ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ తెలిపారు‌‌‌‌‌‌‌.