ఆర్టీసీ కార్మికుల పక్షాన బీజేపీ ఉంది: బండి సంజయ్

ఆర్టీసీ కార్మికుల పక్షాన బీజేపీ ఉంది: బండి సంజయ్

కేసీఆర్ దొర పోకడను ప్రజలు సహించరు

ఉత్తమ్ అహంకార ధోరణి వల్లే కాంగ్రెస్ ఖాళీ

హుజూర్ నగర్ లో రెండు పార్టీలకు బుద్ధి చెప్తారు: కరీంనగర్ ఎంపీ

హుజూర్‌నగర్: సీఎం కేసీఆర్ దొర పోకడను పదర్శిస్తూ ఆర్టీసీ సమ్మెను పట్టించుకోవడం లేదని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. కార్మికులు వారం రోజులుగా సమ్మె చేస్తున్న వారి సమస్యలపై చర్చించే ఆలోచన కూడా ప్రభుత్వం చేయకపోవడాన్ని ప్రజలు చేస్తూ ఉరుకోరని హెచ్చరించారాయన. ఆర్టీసీ కార్మికుల పక్షాన బీజేపీ ముందుంటుందని, వారి పోరాటంలో దన్నుగా నిలుస్తామని చెప్పారు. శనివారం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం మొత్తం హుజూర్ నగర్ వైపు చూస్తోందని, ప్రస్తుతం ప్రతి ఒక్కరి నోటా ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలన్న ఒక్క మాటే వస్తోందని బండి సంజయ్ అన్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అహంకార ధోరణి వల్ల కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతోందన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు ఓట్లు వేస్తే ఇక్కడ అభివృద్ది జరగదని ప్రజలకు తెలుసని చెప్పారు.

యాసతో కేసీఆర్ మోసం

అభివృద్ధి పేరుతో కేవలం డబ్బుకే వెనకేసుకునేందుకే ప్రాధాన్యం ఇస్తూ.. యాస భాషలను ఉపయోగించి కేసీఆర్ ప్రజల్ని మోసం చేస్తున్నారని సంజయ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం.. పేర్లు మార్చి కేంద్రం నిధులు ఇష్టానికి మళ్లిస్తోందని అన్నారు. గ్రామాలకు ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న అన్ని పథకాల్లో కేంద్ర నిధులు ఉన్నాయని, అభివృద్ధి పేరుతో కేసీఆర్ మోసం చేస్తున్నారని చెప్పారు. ఉప ఎన్నికల వల్లే హుజూర్ నగర్ లో రైతు బంధు డబ్బులు వేశారని, వేరే ఏ ప్రాంత రైతుల ఖాతాల్లో డబ్బు జమ కాలేదని చెప్పారు.