అన‌వ‌స‌రంగా బ‌య‌టికొస్తే తాట తీస్తాం

అన‌వ‌స‌రంగా బ‌య‌టికొస్తే తాట తీస్తాం

కరీంనగర్: లాక్ డౌన్ రూల్స్ ను క‌ఠిన‌త‌రం చేసిన క్ర‌మంలో ప్ర‌తి ఒక్క‌రూ పోలీసుల‌కు స‌హ‌క‌రించాల‌ని తెలిపారు కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి బి కమలాసన్ రెడ్డి. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌జ‌ల‌కు బహిరంగ లేఖ రాశారు. లాక్ డౌన్ పొడిగించింది ప్ర‌జ‌లు విచ్చల విడిగా తిరగడానికి కాదన్నారు. లాక్ డౌన్ సందర్భంగా ప్రజలు నిత్యావసర సరుకుల కోసం ఇబ్బంది పడకుండా ఉండడానికి ఉదయం పూట ఇచ్చిన సడలింపు సమయాన్ని చాలామంది దుర్వినియోగం చేస్తున్నారన్నారు.  కొంతమంది ఈ సమయంలో తమ బంధు మిత్రుల ఇళ్లకు వెళ్ళడానికి, చనిపోయిన వారిని పరామర్శించడానికి,  తమ పనులు చక్క బెట్టుకోడానికి కేటాయిస్తున్నారని చెప్పారు. సడలింపు సమయంలో వేరే ఊర్లో ఉన్న తమ కుటుంబ సభ్యులను, బంధువులను కలవడానికి ప్రయాణాలు చేస్తున్నారన్నారు. ఆదివారము రోజు ఉదయం 9-30 గంటలకు చికెన్, మటన్ దుకాణాల ముందు గుంపులుగా చేరి పోతున్నారని..చికెన్ మటన్ ఇప్పుడు కాకపోతే మరోసారి తినొచ్చు.....కానీ ప్రాణం పోతే తిరిగి రాదన్నారు.

మన నిర్లక్ష్యం, అజాగ్రత్త, మాకు ఏమీ కాదన్న మూర్ఖత్వం వల్లనే ప్రస్తుతం  అనుభవిస్తున్న దుస్థితికి కారణమ‌ని తెలిపారు. లేని పోని సాకులతో బయటకు వచ్చి, రోడ్లపై కనిపించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామ‌ని హెచ్చ‌రించారు. అనవసరంగా బయటకు వచ్చిన వారి వాహనాలను స్వాధీనం చేసుకుని, కోర్టులో డిపాజిట్ చేస్తామ‌ని తెలిపారు. ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిపై ఎపిడెమిక్ డిసీజెస్ చట్టం, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ క్రింద కేసులు నమోదు చేస్తామ‌ని.. మీరు సమాజానికి మేలు చేయక పోయినా ఫర్వాలేదు....కానీ మీ కుటుంబాలకు నష్టం చేయకండి అన్నారు. జాగ్రతతో, క్రమశిక్షణతో ఉండి..  కరోనా మహామ్మరి నుండి కాపాడుకోండి అని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి బి కమలాసన్ రెడ్డి సూచించారు.