2 గంటల వానకే ఆగమైన స్మార్ట్సిటీ !..ముందుచూపులేని పనులు.. ముంపులో కరీంనగర్‌‌

2 గంటల వానకే  ఆగమైన స్మార్ట్సిటీ !..ముందుచూపులేని పనులు.. ముంపులో కరీంనగర్‌‌
  • వందల కోట్ల ఖర్చుతో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం
  • ముందుచూపు లేకుండా పనులు చేయడంతో రోడ్లపైనే నిలుస్తున్న వరద
  • నీట మునిగిన కాలనీలు.. ఇండ్లలోకి చేరిన నీరు

కరీంనగర్, వెలుగు : గుంతల్లేని రోడ్లు, అండర్ గ్రౌండ్‌‌ డ్రైనేజీలు అంటూ గత పాలకులు గొప్పలు చెప్పిన కరీంనగర్‌‌ స్మార్ట్ సిటీ డొల్లతనం రెండు గంటల వానకే బయటపడింది. బుధవారం ఉదయం కురిసిన వర్షానికి నగరంలోని ప్రధాన రహదారులన్నీ వాగులను తలపించాయి. ఇండ్లు, అపార్ట్‌‌మెంట్ల సెల్లార్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇండ్లలోకి చేరిన నీటిని ఎత్తి పోసుకోవడానికి, బురదను కడుక్కోవడానికే రోజంతా పట్టింది. నీరు ఇండ్లలోకి చేరడానికి ముందుచూపు లేకుండా కట్టిన డ్రైనేజీ, అండర్‌‌ గ్రౌండ్‌‌ డ్రైనేజీ నిర్మాణాలే కారణమని జనం ఆరోపిస్తున్నారు. డ్రైనేజీల్లో సిల్ట్‌‌ తొలగించకపోవడం కూడా ఈ పరిస్థితికి కారణం అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

నీళ్లలోనే పదికి పైగా కాలనీలు

రాత్రి పూట వర్షం పడిందంటే చాలు కరీంనగర్‌‌లోని కొన్ని ఏరియాల ప్రజలకు కంటి మీద కునుకు ఉండడం లేదు. వర్షానికి వరద పెరిగి ఏ టైంలో ఇంట్లోకి నీళ్లు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. వర్షాలు పడితే సిటీలోని కశ్మీర్‌‌గడ్డ, ముకరంపుర, సాయినగర్, మంకమ్మ తోట, జ్యోతినగర్, హస్సేనిపుర, శర్మ నగర్, బుట్టి రాజారాంనగర్‌‌ కాలనీ, ఆర్టీసీ వర్క్ షాప్‌‌ ఏరియా, విద్యానగర్‌‌ సెయింట్‌‌ జాన్స్‌‌ స్కూల్‌‌ ఏరియా, రాంనగర్‌‌లోని ఇండ్లలోకి నీళ్లు వస్తున్నాయి. ఇక కలెక్టరేట్, టౌటౌన్ పీఎస్‌‌, సీపీ ఆఫీస్, మంచిర్యాల చౌరస్తా ఏరియాల్లో రోడ్లపై మోకాలి లోతు నీళ్లు ప్రవహిస్తున్నాయి. 

డ్రైనేజీ, రోడ్ల నిర్మాణంలో కరువైన ముందుచూపు

నగర ప్రజలు ఇండ్లలో వాడిన నీటితో పాటు, వర్షాకాలంలో రెండు, మూడు గంటలు ఏకధాటిగా వాన పడి వచ్చే వరద సాఫీగా వెళ్లేలా స్మార్ట్‌‌ సిటీ ప్రాజెక్ట్‌‌లో డ్రైనేజీలు నిర్మించాల్సి ఉంది. కానీ ఆ పనుల్లో ఇవేమీ పట్టించుకోలేదు. పీటీసీ, శాతవాహన యూనివర్సిటీ దగ్గరి నుంచి వచ్చే నాలా జిల్లా లైబ్రరీ వెనకాలకు వచ్చే సరికి ఇరుకుగా మారడంతో.. వాన పడినప్పుడు వరద నీరు రోడ్లపైకి చేరి లైబ్రరీ, టూటౌన్‌‌ పీఎస్‌‌ ఏరియా జలమయమవుతోంది. 

అలాగే ఆర్టీసీ వర్క్‌‌షాప్‌‌ ఏరియాకు పైనుంచి వస్తున్న వరద నీరుతో కరీంనగర్‌‌ – జగిత్యాల రోడ్డులో రాకపోకలు నిలిచిపోతున్నాయి. ప్రతి సంవత్సరం వానా కాలంలో ఇలాంటి ఇబ్బందులే తలెత్తుతున్నా బల్దియా ఆఫీసర్లు మాత్రం పరిష్కారం చూపలేకపోతున్నారు. ఇండ్లలోకి నీళ్లు వస్తున్నాయని, రోడ్లు దాటనివ్వడం లేదని ఎన్నిసార్లు చెప్పినా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

డీసిల్టేషన్‌‌ పేరిట లక్షల ఖర్చు.. అయినా కాల్వల నిండా బురదే...

ప్రతి ఏటా వానాకాలానికి ముందే డ్రైనేజీల్లో సిల్ట్‌‌ను తొలగించేందుకు బల్దియా ఆఫీసర్లు టెండర్లు పిలుస్తున్నారు. వర్షాలు పడకముందే డీసిల్టేషన్ పనులు పూర్తి చేస్తే వరద సాఫీగా వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ పనుల కోసం ఏటా లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయితే డీసిల్టేషన్‌‌ పనుల పేరుతో బల్దియా ఆఫీసర్లు, కాంట్రాక్టర్లు ఏటా రూ.లక్షలు వెనుకేసుకోవడం తప్ప.. బురద తీసిన పాపాన పోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డ్రైనేజీల్లో బురద పేరుకుపోవడంతో అరగంట సేపు వాన పడినా.. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. బురద మొత్తం రోడ్లపైకి వస్తుండడంతో తీవ్ర దుర్వాసన వస్తోంది. 

రూ. 647 కోట్లతో స్మార్ట్‌‌ సిటీ పనులు

కరీంనగర్‌‌ నగరం 2017లో స్మార్ట్‌‌ సిటీ ప్రాజెక్ట్‌‌ కింద ఎంపికవగా 47 రకాల పనులను చేసేందుకు రూ.934.35 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో రూ.647 కోట్లతో నగరంలో రోడ్లు, డ్రైనేజీలు, పార్క్‌‌లు, ఫుట్‌‌పాత్‌‌లు నిర్మించగా.. అంబేద్కర్‌‌ స్టేడియంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్, స్ట్రీట్‌‌లైట్స్‌‌, మెయిన్‌‌ సెంటర్లలో ఫ్లడ్‌‌ లైట్లు, సీసీ కెమెరాలు, ట్రాఫిక్ సిగ్నల్స్, ప్రధాన కూడళ్లలో ఫ్రీ వైఫై, డిజిటల్ స్క్రీన్లు వంటి 25 రకాల పనులు చేపట్టారు. 

మరో రూ.287 కోట్ల విలువైన 23 రకాల పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి. అయితే స్మార్ట్ సిటీలో భాగంగా చేపట్టిన రోడ్లను ప్లానింగ్ లేకుండా నిర్మించారన్న విమర్శలు ఉన్నాయి. వర్షం నీరు రోడ్లపై నిల్వ ఉండకుండా.. సైడ్‌‌ డ్రైన్లలోకి వెళ్లేలా మ్యాన్‌‌హోల్స్‌‌ ఏర్పాటు చేయలేదని, అండర్ గ్రౌండ్ డ్రెనేజీని ఎక్కడికక్కడే క్లోజ్‌‌ చేయడం వల్ల సమస్య తలెత్తిందని పలువురు మండిపడుతున్నారు.