కరీంనగర్ కోడి పుంజు వేలంలో ట్విస్ట్..పుంజు తనదంటూ బాధితుడి వీడియో

కరీంనగర్ కోడి పుంజు వేలంలో ట్విస్ట్..పుంజు తనదంటూ బాధితుడి వీడియో

గత కొన్ని రోజులుగా నడుస్తున్న కరీంనగర్ కోడి పుంజు కథ మలుపు తిరిగింది. అధికారులు కోడి పుంజును వేలం వేద్దామనుకునే సరికి ఆ పుంజు తనదే అని బాధితుడు ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఆ కోడి తనదేనని కోడి పందాల కోసం పుంజును సాకుతున్నానని వీడియోలో తెలిపాడు. తనది తనకు ఇవ్వాలని అధికారులను కోరారు. 

అసలు ఏమైందంటే..

నాలుగు రోజుల క్రితం ఓ ప్రయాణికుడు వరంగల్ నుంచి వేములవాడకు వెళ్లే ఆర్టీసీ బస్సులో ఎక్కి సంచిలో తను తెచ్చుకున్న కోడి పుంజును బస్సులో మరిచిపోయాడు. డ్రైవర్ బస్సులో సంచి ఉందనుకొని ఓపెన్ చేసి చూస్తే అందులో పుంజు ఉంది. వెంటనే అతను ఆ పుంజును తీసుకెళ్లి బస్టాండ్ లోని అధికారులకు అప్పజెపపాడు. ఆ కోడి మంచి దిట్టంగా ఉండటంతో సుమారు 6 కిలోలు ఉండోచ్చని అంచనా వేశారు. 

పందెం కోడి కావడంతో దాని  గురించి ఎవరైనా బధితుడు వస్తే ఇద్దామనుకొని అధికారులు ఆ పుంజును నాలుగు రోజులు బస్టాండ్ లోని ఓ కంచెలో ఉంచారు. కానీ ఎవ్వరూ రాకపోవడంతో శుక్రవారం రోజు వేలం వేయాలని అధికారులు నిర్ణయించుకున్నారు. కరీంనగర్ -2 డిపో పరిధిలో వేలం నిర్వహించబడును అని అధికారులు ప్రకటన చేశారు. ఆసక్తి కలవారు బహిరంగ వేలంలో పాల్గొనవచ్చని తెలిపారు.  

 ఆ పుంజు నాది అని బాధితుడి వీడియో

ఆర్టీసీ బస్సులో మరిచిపోయిన పందెం కోడి తనదేనని సిరిసిల్ల జిల్లా రుద్రంగికి చెందిన మహేష్ అనే వ్యక్తి ఓ వీడియో రిలీజ్ చేశాడు. తాను నెల్లూరు వాసినని వృత్తి రిత్యా సిరిసిల్లలో ఉంటున్నానని చెప్పాడు. సంక్రాంతికి ఊరికి తీసుకెళ్దామని కోడిని సాకానని తెలిపాడు. ఈనెల 9న కరీంనగర్ నుంచి వరంగల్ వెళ్తుండగా కోడిని సంచిలో పెట్టి మరిచిపోయానని చెప్పాడు. కోడి తనదేనంటూ ఆధారాలను ఫోటో తీసి  సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో కోడి పుంజు కథలో ట్విస్ట్ ఏర్పడ్డది. ఇప్పుడు అధికారులు ఆ కోడి పుంజును అతనికి ఇస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.