
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు లోకల్ బ్రాండ్ నందిని పాల వివాదం సహకరించినట్టు తెలుస్తోంది. ఈ సారి జరిగిన శాసనసభ ఎన్నికల్లో పాలు, పెరుగు కూడా ప్రచారాస్త్రాలుగా మారాయి. నందిన పాల ఉత్పత్తులకు కన్నడనాట విశేష ఆదరణ ఉంది. కన్నడిగుల ప్రజాజీవనంలో నందిని ఒక భాగంగానూ మారింది. ఈ నేపథ్యంలో గుజరాత్‌కు చెందిన అమూల్ పాలు, పాల ఉత్పత్తులను కర్ణాటకలోనూ ప్రవేశపెట్టడంతో ప్రతిపక్షాల చేతికి కొత్త ఆయుధం లభించింది. నందిని పాల ఉత్పత్తుదారుల జీవితాలతో బీజేపీ చెలగాటమాడుతోందని కోకొల్లలుగా విమర్శలు వచ్చాయి. అమూల్ పాల సరఫరాపై నిషేధం విధించాలని జేడీఎస్, కాంగ్రెస్‌తో పాటు పలు కన్నడ సంస్థలు డిమాండ్ చేశాయి. ఈ విమర్శలపై ముఖ్యమంత్రి బసవరాజ్ బమ్మై స్పందిస్తూ అప్పట్లో.. అమూల్ పాలను కొంతమంది ఆన్‌లైన్‌లో తెప్పించుకుంటుంటే తామెలా ఆపగలమని చేతులెత్తేశారు.
దీంతో నందిని పాల వివాదాన్ని కాంగ్రెస్ ప్రచారాస్త్రంగా ఎంచుకుంది. ఈ సమయంలోనే నందినీ పెరుగు ప్యాకెట్‌పై హిందీ పదం ఉండాలన్న కేంద్రం ఆదేశం కాంగ్రెస్ మరో అవకాశంగా మారింది. కన్నడిగుల సెంటిమెంట్ ను యూజ్ చేసుకున్న కాంగ్రెస్.. నందిని పాల కోసం పోరాటం చేసేందుకు సిద్దమయ్యాయి. అమూల్ ను నిషేధించాలని డిమాండ్ చేయడం అక్కడి ప్రజలను ఆకట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు అదే వివాదం కాంగ్రెస్ ను గట్టెక్కించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. కన్నడ ప్రజల మనోభావాలకు గౌరవం ఇచ్చేలా కాంగ్రెస్ నడుచుకుంటుందని, అందుకే ఈ సారి ఆ పార్టీకి పట్టం కట్టాలని నిశ్చయించుకున్నారని పలువురు చెబుతున్నారు.
ఇక ఇప్పటివరకు జరిగిన ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ లీడ్ లో దూసుకుపోతోంది. ముందు ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే బీజేపీని వెనక్కి నెట్టి కాంగ్రెస్ ముందంజలో సాగుతోంది. దీంతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. పార్టీ ఆఫీస్ వద్ద సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో నందిని పాల వివాదాన్ని నేతలు మరోసారి గుర్తు చేస్తూ.. ఈ విషయంపై నినాదాలు చేస్తూ కనిపించారు. నందిని పాలు గెలిచింది.. అమూల్ పాలు ఓడింది అంటూ కామెంట్స్ చేస్తూ తమ విజయాన్ని చాటి చెబుతున్నారు.