మహిళతో అనుచితంగా ప్రవర్తించిన బీజేపీ ఎమ్మెల్యే

మహిళతో అనుచితంగా ప్రవర్తించిన బీజేపీ ఎమ్మెల్యే

కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావలి ఓ మహిళా కార్యకర్తను జైలులో పడేస్తానని బహిరంగంగా బెదిరించిన ఘటన బెంగళూరులో జరిగింది. దీంతో ఎమ్మెల్యే లింబావలి చేసిన వ్యాఖ్యలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను ఎమ్మెల్యే లింబావలి సందర్శించారు. ఈ క్రమంలో తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన రూత్ సగే మేరీ అక్కడికి వచ్చారు. ఈ క్రమంలోనే ఆమె చెప్పేదేమీ వినిపించుకోకుండా.. రూత్ చేతిలో ఉన్న పిటిషన్ ను ఎమ్మెల్యే లాక్కోవడానికి ప్రయత్నించారు. అంతే కాదు తీవ్ర ఆగ్రహంతో విరుచుకుపడిన ఆ ఎమ్మెల్యే ఆమెను జైల్లో వేయండని పలు మార్లు పోలీసులను ఆదేశించారు. ఆమె చేతిలో ఉన్న పేపర్ ను లాక్కునే సమయంలోనే లింబావలి, రూత్ చేయి పట్టుకొని లాగారు.

దీనిపై స్పందించిన రూత్.. మీకసలు గౌరవం, మర్యాద ఉందా అని ప్రశ్నించారు. తమ భూమిని ఆక్రమించి ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రజల ముందుకు వచ్చారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తనను తీసుకెళ్లమని పోలీసులను ఆదేశించారని, అక్కడ కూర్చోబెట్టమని చెప్పారని రూత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక1971లో నిర్మించిన తన ఆస్తిని BBMP కూల్చివేయడానికి ప్రయత్నిస్తోందన్న ఆవేదనతో ఆమె ఎమ్మెల్యేను కలవడానికి వచ్చినట్టు తెలుస్తోంది. సమస్య ఏదైనా కావచ్చు, కానీ ఓ ప్రజా ప్రతినిధి అయి ఉండి ఇలా బహిరంగ ప్రదేశంలో మహిళతో ప్రవర్తించే తీరు బాగా లేదని రూత్ ఆవేదన వ్యక్తం చేశారు.