ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్..సోనియాపై అనుచిత వ్యాఖ్యలు

ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్..సోనియాపై అనుచిత వ్యాఖ్యలు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తుండగా.. ఈసారి ఎలాగైనా కర్నాటకలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రచారంలో భాగంగా  ఒక పార్టీపై మరో పార్టీ నాయకులు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. కొందరు నాయకులు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్‌ ఖర్గే... ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విషసర్పం అని, తాకితే అంతే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఖర్గే వ్యాఖ్యలపై కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ స్పందించారు. 
కాంగ్రెస్‌ మాజీ అధినేత్రి సోనియాగాంధీ విషకన్య అంటూ కామెంట్స్ చేశారు. 

ఒకప్పుడు ప్రధాని మోడీకి అమెరికా వీసా ఇవ్వడానికి నిరాకరించిందని, ఆ తర్వాత ఆ దేశమే ఆయనకు రెడ్‌ కార్పెట్‌ పరిచి.. స్వాగతం పలికిందని బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ అన్నారు. అలాంటి ఆయనను విషసర్పంతో పోలుస్తూ..కాంగ్రెస్ నాయకులు విషం చిమ్ముతున్నారంటూ మండిపడ్డారు. ఎన్నికల ర్యాలీ సందర్భంగా బసనగౌడ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. 

ప్రధాని మోడీపై కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లిఖార్జున్‌ ఖర్గే చేసిన వ్యాఖ్యల పట్ల ఆయనపై ఫిర్యాదు దాఖలైంది. తన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో వివరణ ఇచ్చారు ఖర్గే.  భారతీయ జనతా పార్టీ పాములాంటిదని..మీరు దాని వద్ద చేరాలని ప్రయత్నిస్తే చనిపోతారని చెప్పానంటూ వెనక్కి తగ్గారు ఖర్గే. తాను మోడీని ఉద్దేశించి మాట్లాడలేదన్నారు. ఆ పార్టీ భావజాలం పాములాంటిదని చెప్పానే గానీ వ్యక్తిగత ప్రకటనలు చేయలేదని వివరణ ఇచ్చుకున్నారు ఖర్గే.